సొంత పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సచిన్ పైలట్ దీక్ష

మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా రాజస్థాన్‍లో అధికార కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు రచ్చ తీవ్రమవుతోంది. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, కీలక నేత సచిన్ పైలట్ మధ్య విభేదాలు నానాటికీ తీవ్రతరమవుతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రిపై సచిన్ పైలట్ మరో యుద్ధం ప్రకటించారు. అవినీతికి వ్యతిరేకంగా ఈనెల 11న ఒక రోజు దీక్ష చేయనున్నట్లు ఆదివారం వెల్లడించారు.
ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలోని వసుంధర రాజే నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ పాలనలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ డిమాండ్ చేశారు.  విచారణ చేపట్టకుంటే బీజేపీతో చేతులు కలిపినట్టు ప్రజల్లోకి సంకేతాలు వెళతాయంటూ ఆరోపించారు. 2018 ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలకు, ప్రకటనలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

ఎన్నికలు ఈ ఏడాదిలో జరగనున్నాయని, బీజేపీ హయాంలో జరిగిన అవినీతిపై ఎన్నికల కోడ్ రాకముందే విచారణ ప్రారంభించాలని సచిన్ పైలట్ డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‍తోనే ఏప్రిల్ 11వ తేదీన జైపూర్‌లో ఒక రోజు దీక్ష చేయనున్నట్టు  ప్రకటించారు.  సొంత పార్టీ ప్రభుత్వంపైనే కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ మరోసారి విమర్శలు గుప్పించారు.

మద్యం మాఫియా, అక్రమ మైనింగ్, భూ ఆక్రమణలపై చర్యలు తీసుకోవటంతో సీఎం గహ్లోత్ ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. వసుంధర రాజే హయాంలో అవినీతి జరిగిందంటూ గతంలో గహ్లోత్ చేసిన వ్యాఖ్యల వీడియోను సచిన్ పైలట్ ప్రదర్శించారు. మరి, విచారణ ఎందుకు ప్రారంభించడం లేదని సీఎం గహ్లోత్‍ను ప్రశ్నించారు.

గత బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ వద్ద ఆధారాలు ఉన్నాయని, కానీ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎం అశోక్ గహ్లోత్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య మరోసారి యుద్ధం తీవ్రమవుతున్నట్టు ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

 2020లోనే డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి పీఠం కోసం సచిన్ పైలట్ తీవ్ర ప్రయత్నాలు చేశారు. 20 మంది ఎమ్మెల్యేలను ఢిల్లీ తీసుకెళ్లి అధిష్టానంపై ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే ఆ తర్వాత పూర్తిస్థాయి మద్దతు లేకపోవడంతో ఆయన వెనక్కి తగ్గారు. తిరుగుబాటు చేసినందుకు గాను కాంగ్రెస్ అధిష్ఠానం సచిన్ పైలట్‍ను డిప్యూటీ సీఎం పదవి నుంచి తప్పించింది. రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడి పదవిని తొలగించింది.

అయినా, వారిద్దరి మధ్య ప్రచ్ఛన్న పోరు కొనసాగుతుంది.  ఇక మరికొన్ని నెలల్లో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ తరుణంలో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం కోసం సచిన్ పైలట్ మళ్లీ తన ప్రయత్నాలు తీవ్రం చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో సొంత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపైనే యుద్ధానికి దిగుతున్నారు.