ఫోన్ లో సంజయ్ ను పరామర్శించిన నడ్డా, అమిత్ షా

కరీంనగర్ జైలు నుంచి విడుదలైన బిజెపి రాష్త్ర అధ్యక్షుడు, ఎంపీ  బండి సంజయ్ కు జాతీయ నేతలు ఫోన్ చేశారు. కేంద్రమంతృలు  అమిత్ షా,  జాతీయ అధ్యక్షుడు నడ్డా, స్మృతి ఇరానీ, పార్టీ ప్రధాన అకార్యదర్శులు తరుణ్ చుగ్, సునీల్ బన్సాల్ సహా  పలువురు నేతలు సంజయ్ కు  ఫోన్ చేసి  పరామర్శించారు.

జరిగిన పరిణామాలు గురించి ఫోన్ లో ఆరా తీశారు. కేంద్రం, జాతీయ నాయకత్వమంతా మీకు అండగా ఉంటుందని బండికి జాతీయ నేతలు మద్దుతిచ్చారు. ప్రజా సమస్యలపై ఉధృతంగా పోరాటం చేయాలని సూచించారు.

కాగా, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీలపై ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూనే మూడు డిమాండ్లను బీఆర్ఎస్ ప్రభుత్వం ఎదుట సంజయ్ పెట్టారు.  టీఎస్ పీఎస్సీ  పేపర్ల లీకేజీలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిందే అని, అప్పుడే దోషులందరూ బయటకు వస్తారని,  సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాల్సిందే అని డిమాండ్ చేశారు.

టీఎస్ పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజీలో మంత్రి కేటీఆర్ పాత్ర ఉందని ఆరోపిస్తూ ఆయన్ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.  టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీల వల్ల నష్టపోయిన అభ్యర్థులకు లక్ష రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని, ఆ కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.  30 లక్షల మంది విద్యార్థులు నష్టపోయారని చెబుతూ వారి తరపున మాట్లాడితే కుట్ర పూరితంగా అరెస్ట్ చేయించారని మండి పడ్డారు.

ఈ మూడు డిమాండ్లు కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసే వరకు ఉద్యమం చేస్తూనే ఉంటామని.. ప్రతి జిల్లాల్లో.. ప్రతి మండలంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు బండి సంజయ్. త్వరలో వరంగల్‌లో నష్టపోయిన యువతతో ర్యాలీ చేస్తామన్నారు . కేసీఆర్ కుటుంబాన్ని వదిలేది లేదని హెచ్చరించారాయన.