కేసీఆర్ అదేశాల మేరకే బండి సంజయ్ అరెస్ట్

కేసీఆర్ అదేశాల మేరకే రాజ్యాంగ విరుద్ధంగా బండి సంజయ్ ని అరెస్ట్ చేశారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్ ఆరోపించారు. తెలంగాణలో అలీబాబా నలబై దొంగల పాలన నడుస్తుందని ధ్వజమెత్తారు.  ఇటీవల మరణించిన బండి సంజయ్ అత్తకు నివాళులర్పించేందుకు తరుణ్ చుగ్ ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చి అక్కడి నుంచి కరీంనగర్ లోని బండి నివాసానికి కొని, అక్కడ చెట్ల వనజ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బండి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు.
 
ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ మీరు బీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరించొద్దని, రాజ్యాంగ బద్దంగా ఉంటామని ప్రమాణం చేసారని పోలీస్  అధికారులకు గుర్తుచేశారు. నోటీస్ లేకుండా అరెస్ట్ చేశారని అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఓ ఎంపీని వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని తరుణ్ చుగ్ ప్రశ్నించారు.
అర్థరాత్రి బండి సంజయ్ ను అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. బండి సంజయ్ ఫోన్ ను పోలీసులే దొంగిలించారని ఆరోపించారు. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే సహించేది లేదని హెచ్చరించారు. బీజేపీ సత్యం కోసం, ధర్మం కోసం పోరాటం చేస్తుందన్నారు. విద్యార్థి, నిరుద్యోగుల తరపున బీజేపీ పోరాడుతుందని స్పష్టం చేశారు.
ఇక రాష్ట్రంలో సామాన్యుని పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబ రాజ్యం నడుస్తుందని విమర్శించారు. నిరుద్యోగుల కోసం బండి పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. లిక్కర్ మాఫియా లూటీ మాఫియాతో పాటు పేపర్ లీక్ మాఫియా నడుస్తుందని ఆరోపించారు. ప్రజల దృష్టి మళ్లించడానికి బండిని అరెస్ట్ చేశారని ధ్వజమెత్తారు.
 
అహంకారంతో రాష్ట్రాన్ని లూటీచేస్తున్న ప్రభుత్వం అనాగరికంగా వ్యవహరిస్తున్నదని తరుణ్ ఛుగ్ మండిపడ్డారు. తెలంగాణాలో లీకేజి మాఫియాతో పాటు లిక్కర్, అవినీతి, కేబుల్, డ్రగ్స్, లూటీ మాఫియా నడుస్తోందని ఆయన విమర్శించారు.
 
తెలంగాణా ప్రజల్లో కేసీఆర్ పాలనపట్ల తీవ్రం ఆక్రోశం నెలకొన్నదని అంటూ కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపే రోజులకు ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. పేపర్ లీకేజి మాఫియా వెనుక ఎవరున్నారు? లీకేజి ఎక్కడ జరిగింది? లీకేజి కంపెనీ ఎవరిది? ఆ లీకేజి కంపెనీతో మీ కుటుంభానికి ఎటువంటి సంబంధం ఉంది? లీకేజి కింగ్ పిన్ ఎవ్వరో ప్రజలకు తెలుసని తరుణ్ ఛుగ్ హెచ్చరించారు.