కూనో నేషనల్‌ పార్క్‌ నుంచి తప్పించుకున్న మరో చీతా

నమీబియా నుంచి తీసుకొచ్చిన ఆఫ్రికన్‌ జాతి చీతాలు నిర్దేశిత ప్రాంతం దాటి బయటకు వెళ్తున్నాయి. కూనో నేషనల్ పార్క్  నుంచి ఇటీవల  ‘ఒబాన్’ అనే చీతా తప్పించుకు పోగా దానిని అధికారులు వెతికి సురక్షితంగా తిరిగి పార్క్‌కు తీసుకొచ్చారు. ఇప్పుడు మరో చీతా నిర్దేశిత ప్రాంతం నుంచి బయటకు వెళ్లిపోయింది.
 
‘ఆశా’ అనే చీతా కూనో నేషనల్‌ పార్కులోని రిజర్వ్‌ ఫారెస్ట్‌ దాటి వీర్‌పుర్‌ ప్రాంతంలోని బఫర్‌ జోన్‌లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం తప్పించుకున్న చీతా నదుల వెంబడి సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు గుర్తించారు. ఈ చిరుతను పట్టుకునే పనిలో పడ్డారు.
 
మరోవైపు చిరుత తప్పించుకుని బఫర్‌జోన్‌లో సంచరిస్తుందని తెలుసుకున్న పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. అయితే అధికారులు మాత్రం ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. చీతాలు జనావాసాల్లోకి రావని చెబుతున్నారు. మరోవైపు నిర్దేశిత ప్రాంతం దాటి చిరుతలు బయటకు వెళ్తుండడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది.దేశంలో అంతరించిపోయినన చీతాల పునరుద్ధరణ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మొదటి విడతలో గతేడాది సెప్టెంబర్‌లో 8 చీతాలు ఆఫ్రికాలోని నమీబియా నుంచి మధ్యప్రదేశ్‌ లోని కూనో నేషనల్‌ పార్కు కు వచ్చాయి. 8 చీతాల్లో ఇప్పటి వరకు నాలుగింటిని కూనో నేషనల్‌ పార్కు నుంచి ఫ్రీ ఎన్‌క్లోజర్లలోకి విడిచిపెట్టారు.

ఒబాన్‌, ఆశాను మార్చి 11న విడిచి పెట్టగా, ఫ్రెడ్డీ, ఎల్టల్‌ను మార్చి 22న విడిచిపెట్టారు. ఎనిమిది చీతాల్లోని నాషా అనే ఆడ చిరుత అనారోగ్యంతో గత నెలలో మృతి చెందింది. ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాలు మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్‌ పార్క్‌కు తీసుకువచ్చారు. వాటిలో
ఏడు మగ, అయిదు ఆడ చీతాలు ఉన్నాయి.

దక్షిణాఫ్రికా జోహన్నెస్‌బర్గ్‌ నుంచి దాదాపు పది గంటల ప్రయాణం చేసి గ్వాలియర్ ఎయిర్‌ ఫోర్స్ స్టేషన్‌కు చీతాలు చేరుకున్నాయి. ఆ తర్వాత భారత వాయుసేన హెలికాప్టర్‌లలో కూనో నేషనల్‌ పార్క్‌కు వాటిని తరలించారు. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్ చౌహన్‌,
కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్‌, భూపేంద్ర యాదవ్ కునో జాతీయపార్కులో సిద్ధం చేసిన క్వారంటైన్ ఎన్‌క్లోజర్లలోకి చీతాలను విడిచిపెట్టారు