అరుణాచల్ ప్రదేశ్‌లో మరో 11 ప్రాంతాలకు చైనా పేర్లు

అరుణాచల్ ప్రదేశ్‌ను తమ భూభాగంగా వాదిస్తోన్న చైనా  తాజాగా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. అరుణాచల్‌లోని 11 ప్రాంతాలకు కొత్త పేర్లు పెట్టి కయ్యానికి కాలుదువ్వుతోంది. ఇటీవల అరుణాచల్‌లో భారత్ నిర్వహించిన జీ20 సమావేశానికి హాజరుకాకూడదని చైనా నిర్ణయించుకున్న తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది.

అరుణాచల్ ప్రదేశ్‌పై తన వాదనను పునరుద్ఘాటించే చర్యగా ఆ రాష్ట్రంలోని 11 ప్రదేశాల పేర్లను ప్రామాణికం చేసిన చైనా దీనిని ‘టిబెట్ దక్షిణ భాగం జాంగ్నాన్’ అని పిలుస్తుంది. చైనా పౌర వ్యవహారాలశాఖ మంత్రి ఏప్రిల్ 2వ తేదీన పేర్లను విడుదల చేశారు. చైనా కేబినెట్‌ నిర్ణయం మేరకు ‘జాంగ్‌నన్‌’ పేరుతో ఈ జాబితాను ఆ దేశం విడుదల చేసింది.

ఇది స్టేట్ కౌన్సిల్, చైనా క్యాబినెట్ జారీ చేసిన భౌగోళిక పేర్లపై నిబంధనలకు అనుగుణంగా ఉంటుందని ఆ దేశ అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ సోమవారం నివేదించింది. ఈ పరిణామాలపై ఢిల్లీలోని ప్రభుత్వ వర్గాలు స్పందిస్తూ చైనా ఇలాంటి చర్యలకు దిగడం ఇదే తొలిసారి కాదని అన్నాయి. అంతేకాదు, పేర్ల మార్చినంత మాత్రాన క్షేత్రస్థాయిలో పరిస్థితి మారిపోదని వ్యాఖ్యానించారు. ‘అరుణాచల్ ప్రదేశ్ ఇప్పటికీ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే’ అని స్పష్టంచేశాయి. 

కొద్ది వారాల్లో భారత్‌లో జరగబోయే షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) సమావేశానికి చైనా రక్షణ శాఖ మంత్రి హాజరుకానున్న వేళ ఈ పరిణామం జరగడం గమనార్హం. ప్రస్తుతం ఈ యురేషియా గ్రూప్‌ అధ్యక్ష బాధ్యతలను భారత్ నిర్వహిస్తోంది. అంతేకాదు, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సైతం జులైలో జరిగే ఎస్‌సీఓ శిఖరాగ్ర సమావేశానికి భారత్ వచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతం భౌగోళిక పేర్లు మార్చిన వాటిలో ఐదు పర్వత ప్రాంతాలు, రెండు మైదానాలు, రెండు నివాస ప్రాంతాలు, రెండు నదులు ఉన్నాయి. అంతేకాదు, స్థలాలు, పేర్లు, వాటి అధీన పరిపాలనా జిల్లాల వర్గాలు కూడా పేర్కొన్నారు. ‘మంత్రిత్వ శాఖ జారీ చేసిన జాంగ్నాన్‌లోని ప్రామాణిక భౌగోళిక పేర్లలో మూడో బ్యాచ్. మొదటి బ్యాచ్ ఆరు ప్రదేశాలను 2017లో రెండో బ్యాచ్‌లో 15 స్థలాలను 2021లో విడుదల చేశాం’ అని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. గతంలోనే భారత్‌ చైనా తీరును తీవ్రంగా ఖండించింది. పేర్లు మార్చినంత మాత్రాన ఆ ప్రాంతాలు భారత్‌లో భాగం కాకుండా పోవని, నిజాన్ని మార్చలేరని స్పష్టం చేసింది.

భారత్-చైనా మధ్య దాదాపు మూడేళ్ల నుంచి తూర్పు లడఖ్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతూ ఉన్నాయి. ఇరుదేశాల సైనికాధికారులు, దౌత్య సిబ్బంది మధ్య పలు దశల్లో చర్చలు జరిగినా పూర్తి ఫలితాలు ఇవ్వలేదు. దీంతో బలగాల ఉపసంహరణలు మినహా మరే పురోగతి లేదు.  అలాంటి సమయంలో టిబెట్ సరిహద్దుల్లో ఉన్న అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా దృష్టిసారించింది. ఇఫ్పటికే అరుణాచల్ ప్రదేశ్‌ను తమ మ్యాప్‌లో చూపించుకుంటున్న చైనా.. ఆ ప్రాంతంలోని పేర్లను మార్చి అక్కడ ఉద్రిక్తతలకు తెరలేపుతోంది.