రెండో రోజూ 10వ తరగతి ప్రశ్నాపత్రం లీక్!

ఒక వంక టీఎస్​పీఎస్సీ ప్రశ్నపత్రాల లీక్ కలకలం రేపగా, సోమవారం నుండి ప్రారంభమైన 10వ తరగతి ప్రశ్న పత్రాలు సహితం తెలంగాణాలో వరుసగా లీక్ అవుతున్నట్లు తెలుస్తున్నది. సోమవారం వికారాబాద్ జిల్లా తాండూర్ లో పదో తరగతి తెలుగు పేపర్ లీక్ అవ్వగా, మంగళవారం వరంగల్ జిల్లాలో  హిందీ పేపర్ లీక్ అయ్యింది.

 హిందీ ప్రశ్నపత్రం ఉదయం 9.30కే బయటకు వచ్చినట్లు వరంగల్ అధికారులు గుర్తించారు. పరీక్ష ప్రారంభమైన కొద్ది సేపటికే హిందీ పేపర్ లీక్ వాట్సాప్‌లో వైరల్‌  అయినట్లు పేర్కొంటున్నారు. ఎస్‌ఎస్‌సి స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూప్‌లో రెండో పేపర్ ప్రత్యక్షం అయినట్టు సమాచారం. వరుస పేపర్ల లీక్ తో విద్యార్థులు, తల్లిదందడ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

హిందీ ప్రశ్నపత్రం బయటకు ఎలా వెళ్లిందనే విషయంపై విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు. ‘‘వాట్సాప్‌లో ఉన్న ప్రశ్నపత్రం ఇవాళ జరిగిన పరీక్షతో సరిపోలింది. ప్రశ్నపత్రం ఎక్కడ్నుంచి వచ్చిందనే అంశంపై ఆరా తీస్తున్నాం. వరంగల్‌ సీపీకి ఫిర్యాదు చేశాం’’ అని డీఈవో వాసంతి తెలిపారు.

ట్సాప్లో  పేపర్   వైరల్ కావడంపై విచారణ చేపడుతున్నామని వరంగల్ సీపీ రంగనాథ్ చెప్పారు. ఇతర జిల్లాల వాట్సాప్లోనూ పేపర్ వైరల్ అయిందని తెలిపారు. ఇది పేపర్ లీకైనట్లు కాదని,  పరీక్షా ప్రారంభమైన  గంటన్నర తర్వాత పేపర్ బయటకు వచ్చిందని పేర్కొన్నారు. పేపర్ లీక్ పై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, ఏ సెంటర్ నుంచి పేపర్ లీక్ అయిందో వాట్సాప్లో  ప్రశ్నాపత్రం లోకేషన్ అధారంగా దర్యాప్తులో తేలుతుందని సీపీ రంగనాథ్ చెప్పారు.

వరంగల్ జిల్లాలో పదో తరగతి హిందీ పేపర్ లీక్ ఘటన ఫై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరా తీశారు. పరీక్షల సమయంలో జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యాలు, పోలీసు విభాగం, పోస్టల్ డిపార్ట్ మెంట్, వైద్యారోగ్య శాఖ అధికారులు, ఆర్టీసీ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

నాలుగు లక్షల 95వేల మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బాధ్యతగా పనిచేద్దామని మంత్రి హితవు చెప్పారు. పరీక్ష రాస్తున్న విద్యార్థులను గందరగోళానికి గురి చేయెద్దని ఆమె కోరారు.