సత్యం, న్యాయానికి బ్రాండ్ అంబాసిడర్‌ సిబిఐ

కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) సత్యం, న్యాయానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. 1963లో ఏర్పాటైన సీబీఐ తన పనితీరు, సామర్థ్యంతో సామాన్య ప్రజానీకం నమ్మకాన్ని సైతం చూరగొందని ఆయన కొనియాడారు. ఏదైనా కేసు పరిష్కారం కోసం సీబీఐకి అప్పగించాలనే డిమాండ్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉందని ఆయన గుర్తు చేశారు.

సోమవారం ఢిల్లీలో జరిగిన సీబీఐ స్వర్ణోత్సవ వేడుకల కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ, వృత్తిపరమైన నిబద్ధత, సమర్ధత కలిగిన సీబీఐ వంటి సంస్థలు లేకుండా అభివృద్ధి భారతాన్ని నిర్మించడం సాధం కాదని స్పష్టం చేశారు. ఈ దిశగా సీబీఐపై అతిపెద్ద బాధ్యత ఉందని ఆయన చెప్పారు.

”మీరు (సీబీఐ) ఎవరి మీద చర్యలు తీసుకున్నారో వారి గురించి మాట్లాడుతున్న వ్యక్తులు చాలా శక్తివంతులు. వాళ్లు ప్రభుత్వంలో, వ్యవస్థలో ఏళ్ల తరబడి ఉన్నారు. ఈరోజుకు కూడా వాళ్లు కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు. కానీ మీరు (సీబీఐ) మీ పని మీదే దృష్టి ఉంచండి. అవినీతిపరులైన ఏ ఒక్కరినీ వదలకండి” అని సీబీఐకి మోదీ దిశానిర్దేశం చేశారు.

సీబీఐ వంటి సమర్ధవంతమైన సంస్థలు, వృత్తినిపుణులు లేకుండా దేశం ముందుకు వెళ్లలేదని ప్రధాని తేల్చి చెప్పారు. బ్యాంకు మోసాల నుంచి వణ్యప్రాణుల సంబంధిత మోసాల వరకూ సీబీఐ పని అనేక రెట్లు పెరుగుతూనే ఉందని చెప్పారు. అయితే అవినీతి రహిత భారతదేశాన్ని రూపొందించడమే సీబీఐ ప్రధాన బాధ్యత అని గుర్తు చేశారు.

పదేళ్ల క్రితం, ఎంత పెద్ద అవినీతి చేస్తే అంత గొప్ప అన్నంతగా పోటాపోటీ ఉండేదని, ఆ సమయంలో చాలా పెద్ద కుంభకోణాలు వెలుగు చూశాయని చెప్పారు. అయితే వ్యవస్థ తమకు దన్నుగా ఉందనే కారణంగా నిందితులు భయపడేవారు కాదని మోదీ పేర్కొన్నారు. కానీ, 2014 తర్వాత తాము అవినీతి, నల్లధనం వెలికితీతపై యుద్ధప్రాతిపదికపై పనిచేశామని ప్రశంసించారు.

”సీబీఐ అధికారులు సమర్ధవంతంగా పనిచేయండి. ఎంతటి శక్తివంతులైన వ్యక్తులకైనా బెదరవలసిన పని లేదు” అని మోదీ సూచించారు. ప్రజాస్వామ్యం, న్యాయానికి అవినీతి పెద్ద అవరోధమని, అవినీతి ముక్త భారతంలో సీబీఐ పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు. అవినీతిపై పోరాటానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఆయన భరోసా ఇచ్చారు.

 అవినీతిని సహించరాదనేది ప్రభుత్వం, ప్రజల కోరక అని ప్రధాని చెప్పారు. పేద ప్రజల హక్కులను అవినీతి ఊడలాక్కుంటుందని, అనేక మంది నేరగాళ్లుగా మారడానికి దారితీస్తుందని ఆయన చెప్పారు. బ్లాక్ మనీ, బినామీ ఆస్తులపై తమ ప్రభుత్వం కొరడా ఝళిపించిందని, అవినీతికి దారితీసే పరిస్థితులపైనా పోరాడుతోందని ప్రధాని వెల్లడించారు.

ప్రజాస్వామ్యానికి, న్యాయానికి అవినీతి పెద్ద అడ్డంకి చెబుతూ అవినీతికి వ్యతిరేకంగా తమ రాజకీయ పోరాటం తగ్గదని తేల్చి చెప్పారు.  ‘అవినీతి అనేది చిన్న నేరం కాదు. అది పేదల హక్కులను లాగేసుకుంటుంది. దాంతో అనేక నేరాలు జరుగుతాయి. అవినీతిపైనే కాక, మేము అవినీతి కారకాలపై కూడా పోరాడుతున్నాం’ అని ఆయన వివరించారు.

అవినీతి ఎక్కడ ఉంటుందో అక్కడ యువతకు సమానావకాశాలుండవని ప్రధాని హెచ్చరించారు. అవినీతి అన్నది ప్రతిభకు శత్రువని ఆయన అభివర్ణించారు. ఎప్పుడైతే బంధుప్రీతి, వంశపాలన పెరుగుతాయో అప్పుడు దేశం ప్రభావితం అవుతుంది, బలహీన పడుతుందని ప్రధాని తెలిపారు.

దేశాన్ని దోచుకోడానికి అవినీతిపరులు లూటీ మార్గాలను ఎంచుకున్నారని ప్రధాని ధ్వజమెత్తారు. వారు ప్రభుత్వ సంపదను కూడా దోచుకుంటున్నారని చెప్పారు. నేడు ‘జనధన్’ బ్యాంకు ఖాతాలు ఆధార్, మొబైల్ ఫోన్లకు అనుసంధానమయ్యాయని చెబుతూ దానితో లబ్ధిదారులు పూర్తి ప్రయోజనాలు పొందుతున్నారని ప్రధాని వివరించారు.