రాహుల్ అనర్హతపై విదేశాల స్పందనపై జైశంకర్ ధ్వజం

పరువునష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష ఖరారైన కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అనర్హత విషయంలో పాశ్చాత్య దేశాలు స్పందించడం పట్ల విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్ తీవ్రంగా మండిపడ్డారు. రాహుల్ అనర్హత విషయంలో అమెరికా, జర్మనీ స్పందించిన విషయం తెలిసిందే.

 దక్షిణ బెంగళూరు ఎంపీ, బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు తేజస్వీ సూర్య  నిర్వహించిన మీట్‌ అండ్‌ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి జైశంకర్ పాశ్చాత్య దేశాల తీరు, ఉచిత పథకాల గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం పాశ్చాత్య దేశాలకు ఉన్న ఓ దురలవాటని ఆయన ఆరోపించారు.

‘‘నేను మీకు నిజమైన సమాధానాలు చెప్పదలుచుకున్నాను. ఇక్కడ రెండు కారణాలున్నాయి. మొదటిది, ఇతరుల వ్యవహారాల గురించి మాట్లాడటం పాశ్చాత్య దేశాలకు ఉన్న దురలవాటు. అది దేవుడు ఇచ్చిన ప్రత్యేక అర్హతగా వారు భావిస్తారు. ఈ విషయాన్ని అనుభవం ద్వారానే వాళ్లు తెలుసుకోవాలి” అంటూ ఆయన ధ్వజమెత్తారు.

ఇదే విధంగా ఇతరులు విషయాల గురించి మాట్లాడుతుంటే..  వారి గురించి కూడా ఇతరులు మాట్లాడతారని అంటూ ప్రస్తుతం అదే జరుగుతోందని ఎద్దేవా చేశారు. రెండోది. మన వాదనల్లోకి ఇతరులను లాగడం అంటూ మన సమస్యలపై స్పందించమని ఇతరులను కోరితే వారు తప్పకుండా మాట్లాడుతారని తెలిపారు.

భారత్‌లో సమస్యలున్నాయి. మీరు ఎందుకు మాట్లాడటంలేదు. ఏమైనా చేయొచ్చు కదా.  అని ఇతరులకు అవకాశం ఇస్తే వారు తప్పకుండా తమ స్పందిస్తారని ఆయన చెప్పారు. నిజానికి ఇక్కడ సమస్య వాళ్లు మాత్రమే కాదు, మనం కూడా. ఈ రెండింటిని సరిచేయాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

మరోవైపు, పలు రాష్ట్రాల్లో ఉచిత పథకాలపైనా జైశంకర్ తనదైన శైలిలో స్పందించారు. ప్రస్తుతం ఉన్నది ఉచిత పథకాల సంస్కృతని పేర్కొంటూ వాటిపై ఆధారపడి దేశాన్ని నడిపించలేమని స్పష్టం చేశారు. ఉచితాలు త్వరగా ప్రజాదరణ పొందడానికి ఉపయోగపడతాయని మంత్రి పేర్కొన్నారు.

ఒకరు ఉచితాలను ఇస్తున్నారంటే  మరోచోట దానికోసం ఇంకొకరు చెల్లిస్తున్నట్లుగానే భావించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీలో ఆప్ సర్కారుపై పరోక్షంగా విమర్శలు చేశారు. ‘‘ ఉచితాల విషయంలో ఢిల్లీలో తెలివైనవాళ్లు ఉన్నారు. ఉచితాల కోసం వాళ్లకు ఎలాంటి వనరులు అవసరం లేదు’’ అని మంత్రి ఎద్దేవా చేశారు.

జీ 20కి ఆతిథ్యం ఇవ్వడం వెనుక ఉన్న లక్ష్యం ‘ప్రపంచాన్ని భారతదేశం కోసం.. భారతదేశాన్ని ప్రపంచ కోసం సిద్ధం చేయడమని విదేశాంగ మంత్రి తెలిపారు. కుబ్బన్ పార్క్‌లో నిర్వహించిన గ్రీట్ అండ్ ట్రీట్‌లో 500 మంది ఓటర్లు, సందర్శకులు పాల్గొని, కేంద్ర మంత్రితో వివిధ అంశాలపై ప్రశ్నించినట్టు ఎంపీ తేజస్వీ సూర్య తెలిపారు.