రాజా సింగ్‌పై మరో వారం రోజుల్లో మూడో కేసు

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ పై కేసుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే అనేక కేసుల్లో ఉన్న ఆయనపై తాజాగా హైదరాబాద్‌లోని షాహినాయత్ గంజ్‌లో మరో కేసు నమోదయింది. శ్రీరామనవమిశోభా యాత్ర సందర్భంగా ఆయన రెచ్చగొట్టే ప్రసంగంతో పాటు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపణలున్నాయి.
 
భారత్ హిందూత్వ దేశంగా మారాలని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. ఆయన ప్రసంగంపై ఎస్సై వీరబాబు అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలోనే అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌లో ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్ కీర్తి కుమార్‌లో రికార్డు చేసిన ఆయన ప్రసంగాన్ని పీఎస్‌లో సమర్పించారు. వారి ఫిర్యాదు మేరకు రాజా‌సింగ్‌పై 153-ఏ, 506 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు నమోదు చేశారు.
అంతేకాదు తన కుమారుడిని పరిచయం చేస్తూ ఇతర కమ్యూనిటీలపై రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ దీనిపైనా కొందరు కేసు పెట్టారు. ఈ ర్యాలీలో కొందరు రాజాసింగ్ అభిమానులు నాథూరాం గాడ్సే ఫొటోలను ప్రదర్శించడం కూడా వివాదాస్పదమైంది.

2023, జనవరి 29న ముంబైలో జరిగిన జన్ ఆక్రోశ్ ర్యాల బహిరంగ సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ రాజాసింగ్‌పై ఇప్పటికే పోలీస్ కేసు నమోదయింది. విద్వేషపూరిత ప్రసంగం చేసినందుకు గాను రాజాసింగ్‌పై ఐపీసీ సెక్షన్ 153 ఏ 1(ఏ) కింద ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదే వ్యాఖ్యలపై హైదరాబాద్ పోలీసులు సైతం నోటీసులు ఇచ్చారు. ఓ కేసులో రాజాసింగ్‌కు బెయిల్ ఇచ్చే క్రమంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదంటూ తెలంగాణ హైకోర్టు షరతు విధించిందన్న విషయాన్ని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ విషయమై వివరణ ఇవ్వాలని పోలీసులు కోరారు.

ఇక గత ఏడాది మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ముస్లిం సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. 2022 అక్టోబర్‌లో హైదరాబాద్ శిల్పారామంలో కమెడియన్ మునావర్ షోకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై అభ్యతరం చేసిన రాజాసింగ్ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు.

అందులో మహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే.. హైదరాబాద్ పోలీసులు రాజాసింగ్‌పై నమోదైన కేసులను దృష్టిలో ఉంచుకుని పీడీయాక్ట్‌ను నమోదు చేసి జైలుకు పంపించారు. మరోవంక, బీజేపీకి కూడా ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేసింది. ఆ తర్వాత నవంబర్ 9న హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి బయటకు వచ్చారు రాజాసింగ్.