కాంగ్రెస్ తో కలిసి బిజెపి పోరాడేది లేదు

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయమై కాంగ్రెస్ తో కలసి ఉమ్మడిగా కేసీఆర్ ప్రభుత్వంపై పోరాడాలని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీసుకొచ్చిన ప్రతిపాదను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తిరస్కరించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటే అని స్పష్టం చేస్తూ కాంగ్రెస్తో కలిసేది లేదని తాను స్పష్టం చేసినట్లు వెల్లడించారు.

పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బిజెపి ఓబిసి మోర్చా రాష్త్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లాకు చెందిన బిఆర్ఎస్ సహా వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలను పార్టీలోకి ఆహ్వానిస్తూ షర్మిల తనకు ఫోన్ చేసి మాట్లాడిన విషయాన్ని నిర్ధారించారు.  ఆమెపై జరిగిన దాడిపై సంఘీభావం కూడా తెలిపానని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి ఈ వ్యవహారంపై పోరాడదామని షర్మిల ఫోన్ చేసి చెప్పినట్లు సంజయ్ వివరించారు.

బండి సంజయ్ , టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి లకు  షర్మిల శనివారం  నేరుగా ఫోన్ చేసి పరీక్షా పత్రాల లీకేజి విషయంలో ఉమ్మడి పోరాటం జరపాలని సూచించారు. ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చెద్ధామని, ప్రగతి భవన్ మార్చ్ పిలుపు నిద్ధామని షర్మిలప్రతిపాదింఛారు. సీఎం కేసీఆర్  మెడలు వంచాలి అంటే ప్రతిపక్షాలు ఏకం కావాలని ఆమె స్పష్టం చేశారు. కలిసి పోరాటం చేయకపోతే ప్రతిపక్షాలను రాష్ట్రంలో కేసీఆర్ బతకనియ్యడని షర్మిల హెచ్చరించారు.

అయితే, రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందన, ప్రజల ఆశీర్వాదంతో బీజేపీ అధికారంలోకి వస్తుందని సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కుటుంబ పాలనను అంతమొందించేందుకు బీజేపీ కార్యకర్తలు శ్రమించాలని పిలుపిచ్చారు.  బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు గోడలపై ఉన్నారని, బీజేపీ నేతలు, కార్యకర్తలు ప్రజల గుండెల్లో ఉన్నారని స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ నేతలపైకి ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయని చెబుతూ పోలీసు బందోబస్తు లేకుండా బీఆర్ఎస్ నేతలు ప్రజల్లో తిరగాలని సంజయ్ సవాల్ విసిరారు.  ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ మాదిరిగా కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని, తెలంగాణలో బెంగాల్ తరహా పాలనను కొనసాగించాలని కేసీఆర్ చూస్తున్నారని మండిపడ్డారు.

లిక్కర్ స్కాం కేసు నుంచి బిడ్డను కాపాడేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబాన్ని కాపాడేందుకు కొంత మంది పోలీసులు దిగజారి ప్రవర్తిస్తున్నారని అంటూ కావాలనే బీజేపీ కార్యకర్తలపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వేధిస్తున్నారని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.