పాన్-ఆధార్ లింక్ గడువు తేదీ పెంపు

పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ చేయనివారికి మరికొంత వ్యవధి ఇచ్చారు.  పాన్-ఆధార్ లింక్ గడువు  తేదీని జూన్ 30, 2023  వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. పన్ను చెల్లింపుదారులకు ఇంకొంతకాలం సమయం ఇచ్చేందుకు గడువు పొడిగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం ఆధార్ నెంబర్‌ను 2023 మార్చి 31లోగా పాన్ కార్డుకు లింక్ చేయాలని తెలిపింది.

2023 ఏప్రిల్ 1 నుంచి ఆధార్ నెంబర్ లింక్ చేయని పాన్ కార్డులు చెల్లవని హెచ్చరించింది. తాజాగా దానిని  జూన్ 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ తేదీలో మీరు లింక్ చేయడంలో విఫలమైతే, మీ పాన్ కార్డ్‌తో ఉపయోగంలోకి రాకుండా ఉండిపోతుందని ఆదాయపన్ను శాఖ తెలిపింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సిబిడిటి) ద్వారా పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి చివరి తేదీని గతంలో చాలాసార్లు పొడిగించారు.

ఇప్పటికే ఈ రెండింటిని అనుసంధానం చేసేందుకు గడువు కూడా విధిస్తూ పొడిగిస్తూ వస్తున్నారు. పాన్‌-ఆధార్‌ లింక్‌ చేయకపోతే వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడంపై ఆదాయపు పన్నుశాఖ చాలాసార్లు విజ్ఞప్తులు చేస్తూ వస్తున్నది. 

పాన్-ఆధార్ లింక్ గడువును మరో ఆరు నెలలు పొడిగించాలని, రూ. 1000 రుసుమును కూడా తొలగించాలని విజ్ఞప్తి చేస్తూ లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి ప్రధాని  నరేంద్ర మోదీకి లేఖ రాసిన కొద్ది రోజులకే ఈ ప్రకటన వెలువడింది.  మార్చి 31, 2022కి ముందు ఆధార్-పాన్ లింకింగ్ ఉచితంగా ఉండేది. ఏప్రిల్ 1, 2022 నుండి రూ. 500 రుసుము విధించారు. ఆ తరువాత జూలై 1, 2022 నుండి రూ. 1,000కి పెంచారు.