అసెంబ్లీ ఎన్నికల అనంతరం పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని వస్తున్న వార్తలపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. ప్రభుత్వం వద్ద అలాంటి ప్రతిపాదనలు ఏమీ లేదని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆ వార్తలన్నీ అవాస్తవమని, ఇంధన ధరల్లో ఎలాంటి మార్పులు ఉండవని ఉద్ఘాటించింది. ఈ మేరకు ఎక్స్‌లో ఓ పోస్ట్ చేసింది. ఇలాంటి వార్తా కథనాలు పౌరుల్లో భయాందోళనలు సృష్టించేందుకు ఉద్దేశించినవని, దురుద్దేశపూరితమైనవిగా మంత్రిత్వ శాఖ అభివర్ణించింది.
గత 4 ఏళ్లుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగని ఏకైక దేశం భారత్ అని స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా ధరలు పెరుగుతున్నా భారత పౌరులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో కూడా ఇంధన ధరలు పెరగొచ్చన్న ఊహాగానాలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ముఖ్యంగా బెంగాల్ వంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ధరలు పెరుగుతాయని కోటక్ ఇన్‌స్ట్యూషనల్ ఈక్విటీస్ పేర్కొంది. ఏప్రిల్ 29న పోలింగ్ అనంతరం ఈ పెంపు ఉండొచ్చని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా ఈ వివరణ ఇచ్చింది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఈ ప్రతీకార చర్యల్లో ప్రపంచంలోని ఇంధన రవాణా మార్గాల్లో అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది.
ఈ జలసంధి పర్షియన్ గల్ఫ్‌ను ప్రపంచ మార్కెట్లకు అనుసంధానంగా ఉంది. అంతేకాదు, ప్రపంచంలో ఐదోవంతు రవాణా ఈ జలసంధి నుంచే జరుగుతోంది. దీంతో అంతర్జాతీయంగా చమురు ధరలు ఆకాశన్నంటాయి. ఫలితంగా, పశ్చిమాసియాలో యుద్ధానికి ముందు 70 డాలర్లుగా ఉన్న బ్యారెల్ చమురు ధర ప్రస్తుతం 100 డాలర్ల పైనే ట్రేడవుతోంది. అయితే, ముడి చమురు ధరలు 50 శాతానికి పైగా పెరిగినా, భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం యథాతథంగా ఉన్నాయి.

More Stories
పెట్రోల్ బదులుగా ఇథనాల్ వాడేందుకు త్వరలోనే ఈ-85 ఇంధనం
ఆన్లైన్ గేమింగ్‌పై మే 1 నుంచి కొత్త మార్గదర్శకాలు
ప్రపంచ జీడీపీ ర్యాంకింగ్స్‌లో 6వ స్థానానికి భారత్