న్యాయవాద వృత్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచాలి

న్యాయవాద వృత్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ పిలుపునిచ్చారు. తమిళనాడు మధురైలో జిల్లా సెషన్స్‌ కోర్టు, చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు శంకుస్థాపన ప్రారంభోత్సవంలో సీజేఐ పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాద వృత్తిలో స్త్రీల నిష్పత్తి నిరాశాజనకంగా ఉందన్న ఆయన మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలని పేర్కొన్నారు.  యువ న్యాయవాదుల రిక్రూట్‌మెంట్‌పై ఛాంబర్స్‌కు అనుమానాలున్నాయని, ప్రభావంతులైన యువతుల కరువు కారణం కాదన్న ఆయన.. మహిళల పట్ల కలిగి ఉన్న మూస పద్ధతుల ఫలితమన చెప్పారు.
 
కుటుంబ బాధ్యతల కారణంగా మహిళలు ఎక్కువ గంటలు పని చేయలేకపోతున్నారని రిక్రూట్‌మెంట్ ఛాంబర్‌లు భావిస్తున్నాయని తెలిపారు. పిల్లలను కనడం, వారి ఆలనాపాలన చూసుకోవడం ఓ ఎంపిక అని, ఈ బాధ్యతలు తీసుకున్నందుకు శిక్షంచకూడదని అందరు మొదట అర్థం చేసుకోవాలని హితవు చెప్పారు. న్యాయవాద వృత్తిలో ప్రవేశించేందుకు తమిళనాడులో 50వేల మంది పురుషులు నమోదు చేసుకోగా, ఇందులో మహిళలు కేవలం 5వేల మంది మాత్రమే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయని సీజేఐ విచారం వ్యక్తం చేశారు. న్యాయవాద వృత్తి మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం లేదని తెలిపారు.  ఈ గణాంకాలు తమిళనాడులోనే కాదని, దేశవ్యాప్తంగా ఇవే గణాంకాలు ఉన్నాయని చెప్పారు. ఈ సందర్భంగా మారుతున్న పరిస్థితులపై సైతం ఆయన చర్చించారు.

కాగా, ప్రభుత్వంలోని వివిధ విభాగాల మధ్య బేదాభిప్రాయాలు ప్రజాస్వామ్యంలో సహజమని పేర్కొంటూ అంటే పరస్పరం ఘర్షణ పడుతున్నట్లు కాదని  కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు స్పష్టం చేశారు. ఇవన్నీ సజీవ ప్రజాస్వామ్యం సూచికలని, సంక్షోభం ఏమాత్రం కాదని తేల్చి చెప్పారు.

మనది ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం అని గుర్తు చేస్తూ భిన్నమైన దృక్పధాల రీత్యా కొన్ని అంశాల విషయంలో భిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉండటం తప్పనిసరి అని ఆయన తెలిపారు. అంటే దానర్ధం పరస్పరం ఘర్షణలకు దిగడం కాదని చెప్పారు. కార్యనిర్వక వ్యవస్థ, న్యాయవ్యవస్థలు మధ్య అధికారాల విభజన ఉండవచ్చని, అంటే దానర్థం కలసి పనిచేయకపోవడం కాదని స్పష్టం చేశారు.

కేసుల పెండింగ్ పెరిగిపోవడం వంటి సమస్యలను గుర్తించి, పరిష్కారాలు కనుగొనడంకోసం మనం ఒక బృందంగా కలసి పనిచేయాలని ఆయన సూచించారు. భారతదేశంలో ఒకొక్క న్యాయమూర్హ్టి రోజుకు 50 నుండి 60 కేసుల వరకు చూడవలసి వస్తుందని, అందుచేత అంతులేని మానసిక వత్తిడులకు గురయ్యే అవకాశం ఉందని చెప్పారు.

 కొన్ని సందర్భాలలో న్యాయం సకాలంలో ఇవ్వలేకపోతున్నారని విమర్శలకు కురవుతున్నారని పేర్కొన్నారు. అయితే అది వాస్తవం కాదని స్పష్టం చేశారు. భారత న్యాయవ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించాలని ప్రభుత్వం కోరుకొంటుందని, అందుకు అవసరమైన మద్దతు అందిస్తుందని కేంద్ర మంత్రి వెల్లడించారు. బార్, బెంచ్ ఒక నాణెపు రెండు ముఖాలన్ని చెబుతూ ఒకటి లేకుండా మరొకరు ఉండలేవని తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ కూడా పాల్గొన్నారు.