మహిళల బాక్సింగ్‌ ప్రపంచ ఛాంపియన్‌లుగా స్వీటీ, నీతు

న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు నీతూ గాంగాస్, స్విటీ బూరాలు చరిత్ర సృష్టించారు. మహిళల బాక్సింగ్‌ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచారు. శనివారం జరిగిన 81కిలోల విభాగం, 48కిలోల విభాగం ఫైనల్లో ప్రత్యర్థులపై గెలిచి ప్రపంచ బాక్సింగ్‌ నయా ఛాంపియన్స్‌గా అవతరించారు.వారిద్దరూ స్వర్ణ పతకాలు సొంతం చేసుకున్నారు.

48 కిలోల విభాగం ఫైనల్లో నీతు అలవోక విజయాన్ని అందుకుంది. మంగోలియా బాక్సర్ లుత్సాయిఖాన్‌తో జరిగిన ఫైనల్లో  మహిళల ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో తొలిసారిగా ఫైనల్‌ ఆడిన నీతూ గంగాస్‌ 50 తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ఆరంభం నుంచే కళ్లు చెదిరే పంచ్‌లతో ప్రత్యర్థిపై విరుచుకు పడిన నీతు సునాయాస విజయాన్ని దక్కించుకుంది.

నీతు ధాటికి ప్రత్యర్థి కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. చివరి వరకు పూర్తి ఆధిపత్యం చెలాయించిన నీతు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ప్రపంచ బాక్సింగ్‌లో స్వర్ణం సాధించిన ఆరో బాక్సర్‌గా నీతు చరిత్ర సృష్టించింది.

తర్వాత జరిగిన 81 కిలోల విభాగం ఫైనల్లో స్విటీ బూరా విజయం సాధించింది. చైనాకు చెందిన వాంగ్ లినాతో జరిగిన హోరాహోరీ ఫైనల్లో స్విటీ 43 తేడాతో జయభేరి మోగించింది. ఆరంభం నుంచే ఇద్దరి మధ్య పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. ఇటు వాంగ్ అటు స్విటీ ప్రతి పాయింట్ కోసం తీవ్రంగా శ్రమించారు.

దీంతో ఫైనల్ పోరు యుద్ధాన్ని తలపించింది. అయితే చివరి వరకు నిలకడైన ప్రదర్శన కనబరిచిన స్విటీ స్వర్ణ పతకాన్ని ముద్దాడింది.  2014లో జరిగిన ప్రపంచ బాక్సింగ్‌లో రజతంతో సరిపెట్టుకున్న స్విటీ ఈసారి స్వర్ణాన్ని సొంతం చేసుకోవడం విశేషం.

ఇదిలావుంటే ఇప్పటి వరకు మహిళల ప్రపంచ బాక్సింగ్‌లో మేరీకోమ్, సరితా దేవి, జెన్ని ఆర్‌ఎల్, లేఖ కేసి, నిఖత్ జరీన్‌లు మాత్రమే పసిడి పతకాలు సాధించారు. తాజాగా వీరి సరసన నీతు, స్విటీలు నిలిచారు. కాగా, ప్రపంచ బాక్సింగ్‌లో మేరీకోమ్ రికార్డు స్థాయిలో ఆరు స్వర్ణాలు సాధించి అత్యంత అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది.

 బౌట్‌ ప్రారంభంతోనే ప్రత్యర్థిపై పంచ్‌ల వర్షం కురిపించింది. తొలి రౌండ్‌లో మంగోలియన్‌ బాక్సర్‌కు ఎక్కడా సందు దొరకనీయలేదు. ఈ టోర్నీలో గంగాస్‌.. కొరియా బాక్సర్‌ కాంగ్‌ డియోయాన్‌ను ఓడించడం ద్వారా తన జైత్రయాత్రను ప్రారంభించింది. నీతూ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఆరో భారతీయ బాక్సర్‌గా అవతరించింది. మేరీకోమ్ (2002, 2005, 2006, 2008, 2010 మరియు 2018), సరితా దేవి (2006), జెన్నీ ఆర్‌ఎల్ (2006), లేఖా కెసి (2006), నిఖత్ జరీన్ (2022) గతంలో విజేతలుగా నిలిచారు.