జనపనార మద్దతు ధర రూ 300 పెంపు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో జనపనారకు కనీస మద్దతు ధర రూ.300 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల రైతులకు గొప్ప ఊరట లభించబోతోంది. క్వింటా ముడి జనపనార మద్దతు ధర ఇంతకుముందు రూ.4750 ఉండేది. రూ.300 అదనగా పెరగడంతో అది రూ.5050 అయ్యింది.
 
కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ (సీఏసీపీ) సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జేసీఐ) అలాగే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వపు నోడల్ ఏజెన్సీగా పనిచేస్తూ లాభనష్టాలను ఈ సంస్థ భరిస్తుంది. కేంద్ర ప్రభుత్వం జేసీఐకి తోడ్పాటునందిస్తుంది. కనీస మద్దతు ధర పెంపువల్ల రైతులకు గతంలో కన్నా ఎక్కు ధర లభించబోతోంది.
 
డిఎ 42 శాతంకు పెంపు
అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను నాలుగు శాతం మేర పెంచారు. ఈ పెంపువల్ల పింఛనుదారులకు కూడా లాభం కలగనుంది.  డియర్నెస్ అలవెన్స్ 42 శాతానికి చేరింది. అంతకుముందు 38 శాతంగా ఉండేది. ఉద్యోగులకు డీఏ పెంచడంవల్ల కేంద్ర ప్రభుత్వంపై రూ. 12,800 కోట్లకు పైగా భారం పడనుంది. జనవరి 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. 47.58 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 69.76 లక్షల మంది పింఛనుదారులకు ప్రయోజనం కలగబోతోంది.
 
2022 సెప్టెంబర్ నెలలో చివరిసారిగా కేంద్రం డీఏను పెంచింది. అప్పుడు డీఏ 4 శాతం పెరుగుదలతో 38 శాతానికి చేరగా తాజా పెంపుతో 42కు చేరింది. కేంద్ర ప్రభుత్వం డీఏను సంవత్సరానికి రెండు సార్లు సవరిస్తుంది. జనవరి నుంచి జూన్ వరకు ఒకసారి, జూలై నుంచి డిసెంబర్ మధ్య కాలానికి మరోసారి డీఏను పెంచుతుంటారు. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా డియర్‌నెస్ అలవెన్స్ సవరణ ఉంటుంది.