అమెరికాలో భారత జర్నలిస్ట్‌పై ఖలిస్థానీ మద్దతుదారుల దాడి

లండన్‌, శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయాలపై దాడికి పాల్పడిన ఖలిస్థానీవాదులు హైకమిషన్‌ భవనాలపై ఉన్న త్రివర్ణ పతాకాన్ని కిందికి లాగేసిన విషయం తెలిసిందే. తాజాగా అమెరికాలోని వాషింగ్టన్‌లో భారత్‌కు చెందిన జర్నలిస్ట్‌పై భౌతిక దాడికి పాల్పడ్డారు. అతనిపై దుర్భాషలాడారు.
 
 ఖలిస్థాన్‌ వేర్పాటువాద నాయకుడు అమృత్‌పాల్‌ సింగ్‌కు మద్దతుగా కొందరు వ్యక్తులు వాషింగ్టన్‌లో ఉన్న ఇండియన్‌ ఎంబసీ వద్ద నిరసన వ్యక్తంచేస్తున్నారు. అక్కడే పనిచేస్తున్న భారత జర్నలిస్ట్‌ లలిత్‌ కే ఝా ఆ కార్యక్రమాన్ని కవర్‌ చేయడానికి వెళ్లారు. ఈ క్రమంలో లలిత్‌పై ఖలిస్థానీ మద్దతుదారులు దాడికిదిగారు. కర్రతో అతని చెవి కింద కొట్టారు.
 
అక్కడితో ఆగకుండా అతనిపై దుర్భాషలాడారు. అయితే అక్కడే ఉన్న అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌కు చెందిన సిబ్బంది అతడిని రక్షించారు. తన విధిని నిర్వహించేందుకు సహాయపడిన సీక్రెట్‌ సర్వీస్‌ వారికి ధన్యవాదాలు చెబుతూ వారు కాపాడకపోయి ఉంటే తాను ఈ విషయాన్ని హాస్పిటల్‌లో ఉండి రాయాల్సి వచ్చేదని చెబుతూ ఆ జర్నలిస్ట్ ట్వీట్ చేశారు.
 
 ఖలిస్థాన్‌ మద్దతుదారుల్లోని ఓ వ్యక్తి తనను ఎడమ చెవిపై రెండు కర్రలతో కొట్టాడని ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. ఒక సందర్భంలో తనను బెదిరించారని చెప్పుకొచ్చారు. దానికి సంబంధించిన వీడియోను తన ట్విట్టర్‌ హాండిల్‌లో లలిత్‌ పోస్ట్‌ చేశారు.

ప్రగతి మైదాన్‌లో ఖలిస్థాన్‌ జెండా ఎగరేస్తాం

మరోవంక, ఢిల్లీలోని ప్రగతి మైదానాన్ని స్వాధీనం చేసుకుంటామని, అక్కడ త్రివర్ణ పతాకానికి బదులుగా ఖలిస్థానీ జెండా ఎగురవేస్తామని ఖలిస్థాన్‌మద్దతుదారులు హెచ్చరించారు. ఖలిస్థాన్‌ వేర్పాటువాద నాయకుడు అమృత్‌పాల్‌ సింగ్‌, అతని అనుచరులకోసం పంజాబ్‌ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్న నేపథ్యంలో ఈ హెచ్చరికలు జారీచేశారు.
 
ముంబై నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చిన ఓ వ్యక్తి సెల్‌ఫోన్‌కు ముందుగానే రికార్డు చేసిన వాయిస్‌ మెసేజ్‌ రావడంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ విభాగం దార్యాప్తు ప్రారంభించింది.  అమృత్‌పాల్ సింగ్ గత వారం రోజులుగా తప్పించుకు తిరుగుతున్నాడు. అతడిని పట్టుకునేందుకు మూడు రాష్ట్రాల పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. పంజాబ్‌లో పోలీసుల కండ్లు కప్పి గత శనివారం పరారైన అమృత్‌పాల్‌ సింగ్‌ ఈ నెల 20న జాకెట్‌, ట్రౌజర్‌తో పాటు నల్ల కండ్లద్దాలు ధరించి అమృత్‌సర్‌లోని ఒక వీధిలో నడుస్తున్న దృశ్యం సీసీ టీవీ కెమెరాలలో రికార్డయింది