కరొనపై ఏప్రిల్‌ 10, 11వ తేదీల్లో మాక్‌ డ్రిల్‌

దేశంలో కరోనా కేసుల ఉదృతిని దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్‌ 10, 11వ తేదీల్లో మాక్‌ డ్రిల్‌ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారం కింద‌టి వ‌ర‌కు ప‌దుల సంఖ్య‌లో న‌మోద‌వుతున్న కేసులు తాజాగా వేల సంఖ్య‌కి చేరింది. దీంతో కేంద్రం హైఅలర్ట్ ప్రకటించింది.
 
దేశవ్యాప్తంగా, ముఖ్యంగా పలు రాష్ట్రాల్లో కొరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ కూడా రెండు రోజుల క్రితం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తాజాగా, రాష్ట్రాలకు కొన్ని సూచనలు చూస్తూ కేంద్ర వైద్యారోగ్య శాఖ, ఐసీఎంఆర్ తో కలిసి ఉమ్మడిగా మార్గదర్శకాలను విడుదల చేసింది.
 
ఇటీవలి కాలంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో కొరోనా టెస్ట్ ల సంఖ్య చాలా తగ్గించారని కేంద్రం పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న ప్రమాణాల ప్రకారం.. ప్రతీరోజు 10 లక్షల జనాభాకు కనీసం 140  టెస్ట్ లు జరగాలని సూచించింది. కేసుల సంఖ్య ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల శ్యాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు ఎక్కువగా పంపించాలని కోరింది. అంతగా విశ్వసనీయం కాని ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ లపై ఎక్కువగా ఆధారపడకూడదని తెలిపింది.

ఈ విషయమై కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు హెచ్చరికాలు జారీ చేసింది. అంతే కాకుండా కరోనా వ్యాప్తి చెంద‌కుండా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని రాష్ట్రాల‌కు సూచించింది. అలాగే దేశంలోని అన్ని రాష్ట్రాలతో కేంద్రం కేంద్రం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనుంది. ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని ఫోర్‌ ‘టీ’ (టెస్ట్‌, ట్రాక్‌, ట్రీట్‌-టీకా)పై దృష్టి పెట్టాలని రాష్ట్రాలకు సూచించింది

ప్రస్తుతం ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న ఇన్ ఫ్లుయెంజా లక్షణాలు కొరోనా లక్షణాల మాదిరిగానే ఉంటాయని, ఈ విషయంలో ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరింది. కరోనా ప్రొటోకాల్ ను ప్రజలు పాటించడం మానేశారని కేంద్రం పేర్కొంది. మాస్క్ లను ధరించడం, భౌతిక దూరం పాటించడం, పరిశుభ్రత పాటించడం వంటి కొవిడ్ ప్రొటోకాల్ విషయంలో అలక్ష్యం వద్దని సూచించింది.

దేశవ్యాప్తంగా గడచిన ఒక్కరోజులోనే 1,590 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని, గడచిన 146 రోజుల్లో ఇవే అత్యధికంగా నమోదైన కేసులని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ శనివారం వెల్లడించింది. ఇక దేశవ్యాప్తంగా యాక్టివ్‌ కేసుల సంఖ్య 8,601కు చేరిందని ఆరోగ్యశాఖ తెలిపింది. మహారాష్ట్రలో ముగ్గురు, కర్ణాటక, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో ఒక్కొరు చొప్పున కరోనాకు బలయ్యారని ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది.
 
మరణాల రేటు 1.19శాతంగా నమోదైంది. ఇక తాజా మరణాలతో కలిపి కరోనా ప్రారంభం నుంచి వైరస్‌తో మృతి చెందిన వారి సంఖ్య 5,30,824కు చేరింది. పాజిటివిటి రేటు 1.33శాతంగా ఉంది. ఇక ఆరోగ్యశాఖ వెబ్‌సైట్‌ సమాచారం ప్రకారం రోజువారీ రికవరీ రేటు 98.79 శాతంగా ఉంది. వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో భాగంగా ఇప్పటివరకు కేంద్రం 220.65 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ వెబ్‌సైట్‌ తెలిపింది.