ఎన్నికలు అనగానే కేసీఆర్ కు కౌలు రైతులు గుర్తు.. బిజెపి

ఎన్నికలు వస్తున్నాయనగానే  సీఎం కేసీఆర్ కు కౌలు రైతులు గుర్తొచ్చారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ కౌలు రైతులు లేరు…కౌలు రైతులకు ఎలాంటి పరిహారం ఇవ్వం అని కుండబద్దలు కొట్టారని ఆయన గుర్తు చేశారు.

2014 నుంచి ఇప్పటి దాక రాష్ట్ర ప్రభుత్వం ఎంత మంది కౌలు రైతులను గుర్తించిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గతేడాది జులై 17న ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిని  నష్టపోయిన  రైతులకు పరిహారం ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించినట్లు గుర్తుచేశారు. వారిలో ఎంతమందకి నష్టపరిహారం ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన నిలదీశారు.

17 జులై 2022లో భూపాలపల్లి, కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు పడితే విదేశీ కుట్ర జరిగిందని, క్లౌడ్ బరస్ట్ చేసి తెలంగాణపై వర్షాలు కురిపించారని సీఎం కేసీఆర్ ప్రకటించారని రఘునందన్ రావు గుర్తు చేశారు. ఆ రోజు విదేశీ కుట్ర జరిగిందన్న కేసీఆర్..ఇప్పుడు ఏ కుట్రలో భాగంగా వానలు పడుతున్నాయని ప్రశ్నించారు.

ఈ విదేశీ కుట్రపై సిట్ వేశారా? అమెరికా వెళ్లి విదేశీ కుట్రపై నిగ్గు తేల్చారా? అని చురకలంటించారు. ఎన్నికల కోసం రైతులపై ప్రేమ ఒలకపోస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో 6 ఎకరాలు దాటిన రైతులకు రైతు బంధు ఇచ్చారా? అని ప్రశ్నించారు.

ఫసల్ భీమాలో ఎందుకు చేరడం లేదని ఓ రైతు ప్రశ్నిస్తే..అవి ఇన్సురెన్స్ కంపెనీలకు లాభం చేకూరుతాయన్న కేసీఆర్..తాను ఇస్తున్న రైతు భీమా ఎక్కడి నుంచి ఇస్తున్నారని నిలదీశారు. ఎస్డీఆర్ఎప్ నిధుల్లో కేంద్రం వాటా లేదని అబద్దాలు ఆడారని చెబుతూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోలోనే కేంద్రం వాటా ఉందని పేర్కొన్నట్లు గుర్తు చేశారు. 

ఆవు పొలంలో మేస్ దూడ గట్టున మేస్తుందా? అన్న చందంగా కేటీఆర్ మాటతీరు ఉందని రఘునందన్ రావు మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై తనకేం సంబంధం అంటున్న కేటీఆర్ పెత్తనం మీదేసుకుని ప్రెస్ మీట్ ఎందుకు నిర్వహించారని ప్రశ్నించారు. మీడియాపై అహంకారం ఎందుకు ప్రదర్శించారని నిలదీశారు.  టీఎస్పీఎస్సీ వ్యవహారంపై విద్యా శాఖ మంత్రి ఎందుకు మాట్లాడలేదని విస్మయం వ్యక్తం చేశారు. టీఎస్పీఎస్సీ బూట్లలో కేటీఆర్ ఎందుకు కాలు పెట్టారని అడిగారు.