తేజస్వి యాదవ్, మీసా భారతిలను ప్రశ్నించిన సీబీఐ, ఈడీ

ఉద్యోగాల కోసం భూ కుంభకోణం కేసులో బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వియాదవ్‌ను సిబీఐ, ఆయన సోదరి మీసా భారతిని ఈడీ శనివారం ప్రశ్నించాయి. విచారణ కోసం న్యూఢిల్లీ లోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేసన్ (సిబిఐ) ప్రధాన కార్యాలయానికి వచ్చినప్పుడు , తాను, తన కుటుంబం ఈ కేసులో పోరాడాలని నిర్ణయించుకున్నట్టు తేజస్వి యాదవ్ చెప్పారు.

మరోవైపు ఇదే కేసుకు సంబంధించి తేజస్వి సోదరి మీసా భారతిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం ఢిల్లీ కార్యాలయంలో ప్రశ్నించింది. ఉద్యోగాల కోసం భూ కుంభకోణం కేసులో సోదరి మీసా భారితిని ప్రశ్నించేముందు సమాజ్ వాది అధినేత అఖిలేష్ యాదవ్ మీసా భారతి ఇంటికి వెళ్లారు.ఇక ఈ స్కామ్‌ దర్యాప్తులో భాగంగా ఆర్‌జెడి అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుటుంబ సభ్యులను పలుమార్లు సిబిఐ విచారించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఈ నెలలో బీహార్‌ ఉపముఖ్యమంత్రి తేజస్వియాదవ్‌ను అరెస్టు చేయబోమని ఢిల్లీ హైకోర్టుకు గతవారమే సిబిఐ హామీ ఇచ్చింది. ఈ కేసులో ఏప్రిల్‌ ఐదు వరకు బీహార్‌ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో తాను విచారణకు హాజరుకాలేనని, తనకు కొంత సమయం కావాలని సిబిఐకి తేజస్వియాదవ్‌ తెలిపినట్లు ఆయన తరపు న్యాయవాది మణిందర్‌ సింగ్‌ పేర్కొన్నారు.

అయితే శనివారం అసెంబ్లీ సమావేశాలు జరగనుందని, మార్చి నెలలో ఏ శనివారమైనా సిబిఐ విచారణకు తేజస్వియాదవ్‌ హాజరు కావాలని సిబిఐ తరపు న్యాయవాది డిపి సింగ్‌ కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలోనే మార్చి 25వ తేదీ సిబిఐ విచారణకు యాదవ్‌ హాజరయ్యారు.

ఫిబ్రవరి 28, మార్చి 4, మార్చి 11 తేదీల్లో తనకు వ్యతిరేకంగా జారీ చేసిన సమన్లను రద్దు చేయాలని తేజస్వి యాదవ్‌ అధికారులను కోరారు.
కాగా, లాండ్‌ ఫర్‌ జాబ్స్‌ కుంభకోణంలో మార్చి 15 వ తేదీ లాలూ ప్రసాద్‌ యాదవ్‌, ఆయన భార్య రబ్రీ దేవి, సోదరి మిసా భారతిలకు సిబిఐ ప్రత్యేక కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.