ఎమ్యెల్సీ ఎన్నికల్లో వైసీపీకి మరో ఎదురుదెబ్బ

ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్యెల్సీ ఎన్నికల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ అనూహ్యంగా విజయం సాధించారు. ఆమెకు 23 ఓట్లు పోలయ్యాయి. వాస్త‌వానికి టీడీపీ బ‌లం 19 కాగా ఈ ఎన్నిక‌లో ఏకంగా 23 ఓట్లు ల‌భించాయి.

ఇప్పటికే గ్రాడ్యుయేట్ ఎమ్యెల్సీ ఎన్నికల్లో మొత్తం మూడు స్థానాలనూ గెలుచుకున్న తెలుగుదేశం పార్టీ తిరిగి క్రాస్ ఓటింగ్ తో ఎమ్యెల్యేల నుండి కూడా మరోసీటు గెలుచుకోవడం అధికార పార్టీకి ఎదురు దెబ్బ తగిలినట్లయింది.  దానితో ఇటీవలనే టీడీపీ నుండి వైసీపీలో చేరి ఎమ్మెల్సీ సీటు పొందిన జయమంగళ వెంకటరమణ ఓటమి చెందారు.

వాస్తవానికి వైసిపి అభ్యర్థులు ఐదుగురికి 22 చొప్పున, మరో ఇద్దరికీ 21 చొప్పున రాగా అందరికన్నా ఎక్కువగా 23 ఓట్లు అనురాధకు వచ్చాయి. అయినా, ఆమె గెలుపును జీర్ణించుకోలేని వైసిపి  ఆమె గెలుపుపై రీకౌంటింగ్ కు పట్టుబట్టింది. రీకౌంటింగ్ జరిపినా ఆమె గెలుపొందారు. శాసనమండలిలో టిడిపి ప్రాతినిధ్యం లేకుండా పోతుంది అనుకొంటున్న సమయంలో అనుకోకుండా నలుగురు సభ్యులు వచ్చిచేరినట్లయింది.

ప్రస్తుతం వైసీపీకి  అసెంబ్లీలో 154 మంది సభ్యుల బలం ఉంది. వైసీపీ నుంచి సొంతంగా గెలిచిన 151మంది ఎమ్మెల్యేల్లో ఇద్దరు ఆ పార్టీకి ఎదురు తిరిగారు. నెల్లూరు జిల్లాకు చెందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి ఆత్మ సాక్షిగా ఓటేస్తామని ఇప్పటికే ప్రకటించారు.  వైసీపీ సొంతంగా 149మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఎమ్మెల్యే కోటాలో ఏడు స్థానాల్లో వైసీపీ అభ్యర్థుల్ని బరిలోకి దింపింది. ఒక్కో అభ్యర్థి గెలుపుకి 22 మంది ఎమ్మెల్యేల బలం అవసరం. అయితే తెలుగుదేశం చేతిలో 19 ఓట్లు ఉంటే మరో నాలుగు ఓట్లు అదనంగా వచ్చాయి.

అందులో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి ఓట్లు పడినా ఆమె ఓట్ల సంఖ్య 21కి చేరినట్టు అవుతుంది. కానీ ఆమెకు 23 ఓట్లు వచ్చాయి. అంటే వైసీపీ నుంచి మరో రెండు ఓట్లు క్రాస్ అయ్యాయని తెలుస్తోంది. ఫలితంగా వైసీపీ నుంచి ఓట్లు వేసిన ఆ ఇద్దరు ఎవరు అన్నది ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఇక వైసీపీ నుంచి బరిలో ఉన్న మర్రి రాజశేఖర్, పెనుమత్స సత్యనారాయణ రాజు, కోలా గురువులు గెలుపొందగా, వెంకటరమణ ఓటమి చెందారు. ఏకగ్రీవంగా మొత్తం ఏడు స్థానాలను గెలుస్తామనే ధీమాతో నామినేషన్లు వేసిన వైసీపీకి అనుకోకుండా పోటీ ఎదురుకావడమే కాకుండా, ఒక సీటు కోల్పోవలసి వచ్చింది.