వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు సస్పెండ్

వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారని అనుమానించిన నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్ పార్టీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణా రెడ్డి వెల్లడించారు.
 
అంతర్గత విచారణలో వీరు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్టు నిర్ధారణ అయ్యిందని ఆయన తెలిపారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.10 నుంచి రూ.15 కోట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు కొనుగోలు చేశారని సజ్జల ఆరోపించారు. నలుగురు సభ్యులు క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లు పూర్తి స్థాయిలో నమ్మిన తర్వాతే… నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
గతంలో ఓటుకు నోటు కేసులో కూడా చంద్రబాబు ఉన్నారని ఆరోపించారు. ఇలాంటివన్నీ చంద్రబాబుకు అలవాటే అని దుయ్యబట్టారు. కొంతకాలంగా ఈ నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ అధిష్టానంపై చాలా అసంతృప్తితో ఉన్నారు. సమయం దొరికినప్పుడల్లా పార్టీపై ప్రత్యక్షంగాను, పరోక్షంగానూ విమర్శలు, సెటైర్లే వేస్తూ వచ్చారు.
కొన్నిసార్టు సొంత పార్టీ నాయకులపై విమర్శలు కూడా చేశారు. వీటంటినీ గమనిస్తూ వచ్చిన అధిష్టానం అవకాశం కోసం ఎదురుచూసింది. ఇంకేముంది పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించినందుకు నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేసింది.  అయితే.. తాను క్రాస్ ఓటింగ్ కు పాల్పడలేదని ఇప్పటికే ఎమ్మెల్యే శ్రీదేవి వివరణ ఇచ్చారు. ఇటు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా తాను వైసీపీ అభ్యర్థికే ఓటు వేశానని చెప్పారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం ఆత్మప్రబోధానుసారం ఓటు వేశానని తెలిపారు. ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మాత్రం దీనిపై నోరు మెదపలేదు.