తిరుమలలో గంజాయి అక్రమ రవాణా కలకలం

తిరుమలలో గంజాయి అక్రమ రవాణా కలకలం రేపుతోంది. దీంతో అప్రమత్తమైన టీటీడీ (టీటీడీ) విజిలెన్స్ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలకు నిషేధిత వస్తువులు తరలిస్తున్నారని సమాచారం రావడంతో తిరుమలలో విజిలెన్స్ సిబ్బంది పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.
 
ఈ నేపథ్యంలో లక్ష్మీ శ్రీనివాసం కార్పోరేషన్ సంస్థ తరపున  వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పని చేస్తున్న గంగాధరం అనే వ్యక్తిని విజిలెన్స్  అధికారులు పట్టుకున్నారు. గంగాధరం ను తనిఖీ చేయగా అతని వద్ద సుమారు 125 గ్రాముల చిన్న చిన్న గంజాయి ప్యాకెట్లు లభించాయి. వాటిని చూసి అధికారులు అవాక్కయ్యారు.
 
తిరుపతి, తిరుమలకు తరచూ అక్రమంగా గంజాయి సరఫరా చేస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేసిన విజిలెన్స్ అధికారులు విచారణ నిమిత్తం తిరుమల ఎస్ఈబి పోలీసులకు అప్పగించారు. తిరుమలలో గంజాయి లభ్యం కావడంపై ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
మరోవైపు కొంత కాలంగా తిరుమలకు నిషేధిత వస్తువులు తరలిస్తున్న సమాచారంతో పలు ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. జీఎన్సీ టోల్ గేట్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టగా టీటీడీ క్వార్టర్స్ వద్ద కూలీల‌ దగ్గర మద్యం సీసాలు లభించాయి. ఆ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. జీఎన్సీ టోల్ గేట్ వద్ద రెండు కూరగాయల వాహనాల్లో.. 200 గ్రాముల గంజాయిని పోలీసులు గుర్తించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే తరచూ గంజాయి, వివిధ నిషేధిత వస్తువులు తిరుమలకు తరలిస్తుండడంతో నిఘా వ్యవస్థపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.