26 శాతం మందికి అందని శుద్ధమైన తాగునీరు

ప్రపంచ జనాభాలో 26 శాతం మందికి స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో లేదని, 46 శాతం మందికి కనీస పారిశుధ్యం అందడం లేదని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ప్రపంచంలో  ప్రతి నలుగురిలో  ఒకరికి  స్వచ్ఛమైన తాగునీరు  అందడం లేదని  ఆవేదన వ్యక్తం చేసింది.  ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా 45 ఏళ్ల తర్వాత జలవనరులపై మొదటిసారిగా ఐరాస  ఓ సుదీర్ఘ సదస్సు నిర్వహించింది. ఈ సదస్సులో పలు  అంశాలను ప్రస్తావిస్తూ ‘యుఎన్‌ ప్రపంచ జల అభివృద్ధి నివేదిక 2023’ ను విడుదల చేసింది.

2030లోగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరికీ స్వచ్ఛమైన నీరు, పారిశుధ్యం అందుబాటులో ఉండేలా చూడాలన్న లక్ష్యాలను చేరుకోవడానికి,  ప్రస్తుత పరిస్థితులకు మధ్య ఉన్న అంతరాన్ని ఈ నివేదిక తేటతెల్లం చేసింది.  నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవడానికి 600 బిలియన్‌ డాలర్ల నుంచి ఒక ట్రిలియన్‌ డాలర్లు అవసరమని నివేదిక ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ రిచర్డ్‌ కానర్‌ వెల్లడించారు.

200 కోట్ల మంది ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు, పారిశుధ్యాన్ని అందించడానికి 3.6 మిలియన్ల పెట్టుబడి అవసరమని కానర్‌ పేర్కొన్నారు. పెట్టుబడిదారులు, ఫైనాన్షియర్లు, ప్రభుత్వాలు, వాతావరణ మార్పు సంఘాలతో భాగస్వామ్యంతో పర్యావరణ పరిరక్షణకు పెట్టుబడులు సమకూర్చవచ్చని  తెలిపారు.

గత 40 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా నీటి వినియోగం ఏడాదికి సుమారు 1 శాతం పెరిగిందని నివేదిక పేర్కొంది. జనాభా పెరుగుదల, సామాజిక ఆర్థిక అభివృద్ధి, మారుతున్న వినియోగ విధానాలతో  2050 నాటికి  మరింత పెరగవచ్చని  అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం నీటిలో 70 శాతం వ్యవసాయానికి వినియోగిస్తున్నారని తెలిపింది.

డ్రిప్‌ ఇరిగేషన్‌ వంటి పద్ధతులతో నీటిని ఆదా చేయవచ్చని.. దీంతో నగరాలకు నీరు అందుబాటులోకి వస్తుందని సూచించారు. పర్యావరణ మార్పుల కారణంగా మధ్య ఆఫ్రికా, తూర్పు ఆసియాలతో పాటు దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాలు సీజన్ల వారీ నీటి కొరతను ఎదుర్కొంటాయని పేర్కొన్నారు.

 ఇప్పటికే గడ్డు పరిస్థితుల్లో ఉన్న పశ్చిమాసియా, సహారా పరీవాహక ప్రాంతాలు దుర్భర పరిస్థితుల వైపు పయనిస్తున్నాయని  నివేదిక హెచ్చరించింది. సగటున ప్రపంచ జనాభాలో 10 శాతం మంది కటిక నీటి కొరత ఉన్న దేశాల్లో నివసిస్తుండగా, 350 కోట్ల మంది ప్రజలు ఏడాదికి కనీసం ఒక నెల నీటి కొరతను ఎదుర్కోవాల్సి వస్తుందని ఐరాస అనుబంధ సంస్థ యునెస్కో నివేదిక ఒకటి వెల్లడించింది.

2000 సంవత్సరం నుండి ఉష్ణమండలంలో వరదలు నాలుగు రెట్లు పెరిగాయని నివేదిక పేర్కొంది. అలాగే ఉత్తర మధ్య అక్షాంశాలలో వరదలు 2.5 రెట్లు పెరగాయని తెలిపింది.  పర్యావరణ మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు పెరిగాయని దీంతో చాలా ప్రాంతాల్లో నీటి ఎద్దడి తీవ్రత పెరుగుతోందని తెలిపింది. శుద్ధి చేయని మురుగు నీరు కారణంగా నీటి కాలుష్యం పెరుగుతోందని కానర్  పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 80 శాతం మురుగు నీరు శుద్ధి చేయకుండానే విడుదలవుతుందని, అనేక అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇది 99 శాతంగా ఉందని అన్నారు.