ఔట్ సోర్సింగ్ నియామకాలతోనే పేపర్ లీకేజి!

టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో పాలనపరమైన, విధాన పరమైన వైఫల్యాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయని లీకేజీ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నిర్ధారణకు వచ్చిన్నట్లు తెలుస్తున్నది.  సర్వీస్ కమిషన్‌లో కీలక బాధ్యతలను ఔట్ సోర్సింగ్ కింద నియామకమైన వారికి అప్పగించడం వల్లే లీకేజీ వంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని సిట్ అంచనాకు వచ్చినట్టు చెబుతున్నారు.

నేడు ప్రభుత్వ నియామకాలు చాలావరకు తగ్గిపోవడంతో ఎక్కువగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సేవలపై ఆధారపడుతున్నారు. ప్రశ్న పత్రాల లీకేజీకి సంబంధించి సిట్ చీఫ్,హైదరాబాద్ నగర ఆదనపు పోలీస్ కమిషనర్ ఆర్ శ్రీనివాస్ కేసు దర్యాప్తు నిమిత్తం పలు మార్లు నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయానికి వెళ్లారు.

ఈ సందర్భంగా ఆయన చైర్మన్, కార్యదర్శితో పాటు వివిధ సెక్షన్ల అధికారులను సిబ్బందిని కలిసి కమి షన్ పనితీరు, విధులు బాధ్యతలపై అరా తీశారు. కమిషన్‌లో పలు ప్రధానమైన విభాగాల్లో ఔట్ . సోర్సింగ్ ద్వారా ఎంపికైన వారితో నిర్వహిస్తున్న విషయాన్ని అయన గమనించినట్టు చెబుతున్నారు. ప్రశ్న పత్రాల తయారీకి అవలంబిస్తున్న విధానంతో పాటు వాటి కూర్పు, ఎంపిక ఎలా చేస్తారని కూడా అయన అడిగి తెలుసుకున్నారు.

తెలంగాణ  పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ప్రశ్నపత్రాల రహస్యాలన్నీ కిందిస్థాయి ఉద్యోగులకు అప్పగించి చేతులు దులుపుకున్నారన్న అభిప్రాయంతో సిట్ ఉన్నట్టు సమాచారం. కమిషన్ ప్రధాన కార్యాలయంలో ఎన్ని విభాగాలున్నాయనే అంశంతో పాటు వివిధ సమాచారాన్ని సేకరించారని తెలుస్తోంది. కమిషన్‌లో ప్రతి విభాగం చేసే కార్యకలాపాలు అత్యంత గో ప్యాంగా ఉండాలని కానీ ఆలా జరగడం లేదన్న అభిప్రాయాన్ని సిట్ చీఫ్ వ్యక్తం చేసినట్టు సమాచారం.

విశ్వ విద్యాలయాలు, ఇంటర్ బోర్డు టెన్త్ క్లాస్ బోర్డు తరహాలో పరీక్షల నియంత్రణ అధికారులు, సహాయ పరీక్షల నియంత్రణ అధికారులు,  కార్యదర్శులు డిప్యూ టీ అసిస్టెంట్ డైరెక్టర్లు సర్వీస్ కమిషన్‌లో ఉన్నారా? అని అడిగినట్టు తెలుస్తోంది. కమిషన్ కార్యాలయంలో కంప్యూటర్ నెట్ వర్క్ అత్యంత బలహీనంగా ఉన్న అంశంపై కూడా సిట్ అరా తీసింది.

పైగా, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు చెల్లించే జీతాలకు కేటాయింపులు తగ్గించడంతో ఆరుగురు పనిచేయాల్సిన స్థానంలో నలుగురితోనే కాలం వెళ్లదీస్తున్నట్టు సిట్ గుర్తించింది. ఎవరైనా ఉద్యోగి కంప్యూటర్ ల్యాన్లో ఎప్పుడు లాగిన్ అయ్యారు? ఎప్పుడు లాగౌట్ అయ్యారు? ఏఏ ఫైళ్లను పరిశీలించారు తదితర విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకునేలా రక్షణ వ్యవస్థ ఉండాలి.

కానీ ఇక్కడ అటువంటి ఏర్పాట్లు ఏవీ కనబడటం లేదు. ఎక్కడ చూసినా విధానాల్లో లోపాలు స్పష్టంగా కనిపించాయని..,  దీన్ని ఆసరాగా చేసుకునే నిందితులు ప్రశ్న పత్రాలను లీక్ చేశారన్న అభిప్రాయంతో సిట్ ఉన్నట్టు చెబుతున్నారు.

భారీ సంఖ్యలో ఖాళీలు

రాష్ట్రంలో వివిధ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేసే టీఎస్పీఎస్సీలోనే భారీ సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. కమిషన్లో ఉండాల్సిన దానిలో సగం ముందే రెగ్యులర్ ఎంప్లాయిస్ కాగా, మిగతా వారంతా ఔట్ సోర్సింగ్ వారే. రిక్రూట్ మెంట్ పనులు, కాన్ఫిడెన్షియల్ వర్క, లీగల్ పనుల కోసం టీఎస్పీఎస్సీకి సుమారు 400 మంది వరకు ఉద్యోగులు అవసరం. కానీ ప్రస్తుతం 165 మందితోనే నెట్టుకొస్తున్నారు.

ప్రస్తుతం టీఎస్పీఎస్సీ కేడర్ సామర్థ్యం 165 ఉండగా, వీరిలో రెగ్యులర్ ఎంప్లాయిస్ 83 మందే. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్ తదితర 4వ తరగతి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయా ఖాళీల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పని చేస్తున్నారు. 

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ)లో రెండు వేల నుంచి నాలుగు వేల వరకూ ఉద్యోగాలు భర్తీ చేస్తారు. అక్కడ సుమారు 1,800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కానీ ఏటా 4 వేల వరకూ ఉద్యోగాలు భర్తీ చేసే టీఎస్పీఎస్సీలో 200 మంది కూడా లేకపోవడం గమనార్హం.  ప్రభుత్వం గతేడాది మార్చిలో ఏకంగా 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీనికి అనుగుణంగా 17 వేలకు పైగా పోస్టుల భర్తీకి 2022లో టీఎస్పీఎస్సీ 26 నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు సిబ్బంది కొరత వేధిస్తోందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.