సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ విచారణ 27న!

రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక నిందితురాలిగా భావిస్తున్న సీఎం కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ దర్యాప్తు జరుపుతున్న తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ విచారణపై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైనా ఉంది.
ఇప్పటికే మూడు రోజుల పాటు, సుమారు 28 గంతలు సేపు ఆమెను విచారించిన ఈడీ సహితం ఆమె దాఖలు చేసిన పిటీషన్ పై కేవియట్ పిటీషన్ దాఖలు చేసింది.  ఈ రెండు పిటీషన్లు సుప్రీంకోర్టు ముందు విచారణకు శుక్రవారం రావలసి ఉంది.
 
ఆ తర్వాతనే ఈడీ తదుపరి చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ఈనెల 11, 20, 21 తేదీల్లో ఆమెను ఈడీ అధికారులు విచారించారు.  ఈ క్రమంలో ఎమర్జెన్సీ పిటీషన్ కింద విచారణ జరిపి ఈడీ విచారణపై తీర్పు ఇవ్వాలని విచారణకు ముందు పిటీషన్ లో ఆమె పేర్కొన్నారు.
 
కానీ 24నే విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. అయితే, ఇప్పుడు ఉన్నట్టుండి కవిత పిటీషన్ విచారణ తేదీలో మార్పు ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఈనెల 24న కాకుండా 27న విచారణ జాబితాలో చేర్చినట్లు సమాచారం. అయితే అకస్మాత్తుగా విచారణ తేదీ మార్పుకు గల కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది.
 
కాగా ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత మూడు సార్లు విచారణకు హాజరయ్యారు. ఈనెల 11న తొలిసారి ఆమె ఈడీ విచారణకు హాజరవ్వగా..సుమారు 8 గంటలకు పైగా అధికారులు విచారించారు. ఆ తరువాత నిన్న కూడా సుమారు 10 గంటల పాటు కవితను ప్రశ్నించారు. ఇక ఈరోజు కూడా 10 గంటలు కవితపై ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే ఆమె విచారణ ఇంతటితో ముగిసిందా? లేక మరోసారి విచారణకు హాజరవ్వాలా? లేక మరికొన్ని రోజులకు విచారణకు రావాలని నోటీసులిస్తారా అనేది అధికారికంగా తెలియాల్సి ఉంది.