2, 3 సంవత్సరాలలో భారత్ లో 6జీ సేవలు

రానున్న రెండు, మూడేళ్ళలో దేశంలో 6జి సేవలు కూడా అందుబాటులోకి వస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. ప్రస్తుతం భారత్ లోని దాదాపు అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయని గుర్తు చేశారు. త్వరలో దేశవ్యాప్తంగా గ్రామ స్థాయి వరకు 5 జీ సర్వీసెస్ ను అందిస్తామని టెలీకాం కంపెనీలు చెబుతున్నాయి.
 
కొత్త అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్‌ యూనియన్‌ (ఐటీయూ) ఏరియా ఆఫీస్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ను ప్రధాని మోదీ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా భారత్‌ 6జీ విజన్‌ డాక్యుమెంట్‌ను, ‘కాల్‌ బిఫోర్‌ యు డిగ్‌’ యాప్‌ను కూడా ప్రారంభించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ విప్లవం కొనసాగుతోందని ప్రధాని మోదీ తెలిపారు. ప్రపంచంలోనే భారత్ లో 5 జీ సేవలు అత్యంత వేగంగా విస్తరించాయని చెబుతూ కేవలం 4 నెలల్లో మొత్తం 125 నగరాలు, పట్టణాల్లో 5జీ  సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.

త్వరలో 6 జీ సేవలను అందించడానికి సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభమవుతాయని చెప్పారు.  నేడు ఆవిష్కరించిన 6జీ విజన్ డాక్యుమెంట్ ఆధారంగా దేశంలో 6 జీ సేవల ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు.  ఈ 6 జీ విజన్ డాక్యుమెంట్ ను భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, ఆర్ అండ్ డీ సంస్థలు, విద్యా సంస్థలు, టెలీకాం సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉన్న టెక్నాలజీ ఇన్నోవేషన్ గ్రూప్ రూపొందించింది.

కాగా, భారత్‌లో అతితక్కువ ధరకే డేటా లభ్యమవుతోందని.. గ్రామాల్లో ఇంటర్నెట్‌ వినియోగదారుల సంఖ్య భారీగా పెరిగిందని ప్రధాని చెప్పారు. పట్టణాల కంటే గ్రామీణ ప్రజలే ఎక్కవగా ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నారని తెలిపారు. దేశంలో 2 లక్షల గ్రామాలకు ఆప్టికల్‌ ఫైబర్‌ సేవలు అందాయని చెప్పారు. దేశంలో బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగదారులు కూడా బాగా పెరిగారని ఈ సందర్భంగా తెలిపారు.

న్యూఢిల్లీలోని మెహ్రౌలిలోని సెంటర్‌ ఫర్‌ డెవలప్మెంట్‌ ఆఫ్‌ టెలిమాటిక్స్‌ (సీ-డాట్‌) భవనంలోని రెండో అంతస్తులో ఉన్న ఏరియా కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి 2022 మార్చిలో ఐటీయూతో భారత్‌ ఒప్పందం కుదుర్చుకుంది. కొత్త కార్యాలయం భారతదేశం, నేపాల్‌, భూటాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక, మాల్దీవులు, ఆఫ్ఘనిస్తాన్‌, ఇరాన్‌ లకు సేవలందిస్తుందని, దేశాల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం- ఈ ప్రాంతంలో పరస్పర ప్రయోజనకరమైన ఆర్థిక సహకారాన్ని నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుందని ఒక ప్రకటనలో తెలిపింది.