కవిత వాడిన పాత ఫోన్లపైనే నిలదీసిన ఈడీ 

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మూడోసారి, వరుసగా రెండో రోజు  సుమారు పది గంటలపాటు జరిగిన విచారణలో ముఖ్యంగా ఆమె వాడిన పాత ఫోన్లపైననే అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తున్నది. ఆమె  గతంలో 10  సెల్ ఫోన్లను ధ్వంసం లేదా మార్చినట్లుగా ఈడీ అధికారులు అభియోగాలు మోపగా మంగళవారం ఈడీ విచారణకు వెళ్తున్న సందర్భంలో తాను గతంలో వాడిన మొబైల్ ఫోన్లు అంటూ ఆర్భాటంగా మీడియాకు ప్రదర్శిస్తూ తీసుకెళ్లారు.

ఈడీ విచారణ ముఖ్యంగా ఈ ఫోన్ల చుట్టే జరుగుతున్నట్లు తెలుస్తున్నది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ వ్యవహారంలో ఆధారాలను మాయం చేసేందుకు కవిత ప్రయత్నించారనే ఆరోపణల నేపథ్యంలో ఫోన్లను ధ్వంసం చేయలేదని సందేశాన్నిస్తూ కవిత పాత ఫోన్లు ప్రదర్శించారు. అంతేకాదు, ఈడీపై నిందలు వేస్తూ ఆమెను విచారిస్తున్న  ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగిందర్‌కు అందిస్తున్న లేఖను కూడా ఆమె మీడియాకు విడుదల చేశారు. తనపై ఈడీ తప్పుడు ప్రచారం చేస్తోందని, దురుద్దేశంతో వ్యవహరిస్తోందని కవిత ఆరోపించారు. అందుకే తన పాత ఫోన్లన్నీ ఇచ్చేస్తున్నానని పేర్కొన్నారు.

 నవంబర్ లోనే తాను ఫోన్లు ధ్వంసం చేశానని ఈడీ ప్రచారం చేసిందని,  ఏ ఉద్దేశంతో ఇలా చేశారని కవిత ఈడీని ప్రశ్నించారు. మహిళల ఫోన్లు స్వాధీనం చేసుకోవడం అంటే స్వేచ్ఛకు భంగం కలిగించడమే అవుతుందని ఆమె ఆరోపించారు. ఫోన్ల విషయంలో కనీసం సమన్లు కూడా ఇవ్వలేదని కవిత తన లేఖలో పేర్కొన్నారు. అయినప్పటికీ తాను విచారణకు సహకరిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు.

అయితే విచారణకు వచ్చే ముందు ఆమె చూపించిన ఫోన్ల మీద బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. కవిత చూపించిన ఫోన్లు పాతవి కాదు.. కొత్తవి అని ఆరోపిస్తున్నారు. ఈడీ అధికారులు అడిగిన ఫోన్లనే కవిత ఇచ్చారా? లేకుంటే ఈడీ అడిగింది కదా అని ఏదో కొన్ని ఫోన్లను కవిత సమర్పించారా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.

అయితే కవిత చూపించిన మొబైల్ ఫోన్లను కాస్త జూమ్ చేసి చూస్తే మొత్తం ఐదు ఫోన్లు మాత్రమే కనిపిస్తున్నాయి. అందులోనే ఒకట్రెండు ఐఎంఈఐ నంబర్లు స్పష్టంగానే కనిపిస్తున్నాయి.  కవిత అధికారికంగా మీడియా రిలీజ్ చేసిన ప్రకటనను చూసినా అందులో మూడు ఫోన్లు మాత్రమే 2021లో కొన్నట్లు, మిగిలినవన్నీ 2022లోనే కొన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.

ఇది గమనించిన బీజేపీ నేతలు కవిత చూపించిన ఫోన్లు పాతవి కానే కాదని, కొత్తవి అని ఆరోపిస్తున్నారు. మొబైల్ ఫోన్ల ఫొటోలు, వీడియోలను జూమ్ చేసి చూసి వాటికున్న ఐఎంఈఐ నెంబర్లను చూపించి ఫోన్లు ఎప్పుడు కొన్నారు..? అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా కవిత మీడియాకు చూపించిన ఆ ఫోన్లలో ఒకటి ఐ ఫోన్  ఉండటంతో దాని ఐఎంఈఐ నంబర్‌ను ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి కనిపెట్టారు.

ఈ ఫోన్ లాంచ్ అయ్యింది 2022 సెప్టెంబర్‌లో అని, అయితే కొన్నది మాత్రం అక్టోబర్‌లో అని స్పష్టంగా ఉందని నెటిజన్లు, బీజేపీ నాయకులు చెబుతున్నారు. అంతేకాదు లిక్కర్ స్కామ్ బయటికొచ్చింది జులై నెలలో అనే విషయాన్ని కూడా ఇక్కడ బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. అసలు ఈ ఫోన్ ఐఎంఈఐ నంబర్‌కు, కొన్న తేదీకి.. స్కామ్ బయటికొచ్చిన తేదీకి అస్సలు ఎక్కడా మ్యాచ్ కావట్లేదని బీజేపీ నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

 మరోవైపు.. ఇదివరకు ఈడీ అధికారులు కవితతో పాటు పిళ్లై, బుచ్చిబాబుకు సంబంధించిన మొత్తం ఫోన్ కాల్ డేటా, ఫోన్ల వివరాలను 32 పేజీలతో విడుదల చేశారు.  కవిత వాడిన ఫోన్లు స్వాధీనం చేసుకున్నాక ఈడీ అధికారులు.. ఆ ఫోన్లు, అందులో ఉన్న డేటాకు సంబంధిన ప్రశ్నలే అడిగినట్టు సమాచారం. అయితే కవిత తీసుకెళ్లిన కొన్ని ఫోన్ల ఐఎంఈఐ నంబర్లు, ఈడీ అధికారుల దగ్గరున్న డేటాకు మ్యాచ్ కాలేదని సమాచారం. 

లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఫోన్ సంభాషణలన్నీ 2021లో జరిగాయి. అయితే కవిత ఈడీకి సమర్పించిన ఫోన్లనో ఒకే ఒక్కటి తప్ప మిగిలినవన్నీ 2022లో కొన్నారని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఫోన్లకి ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు ఎటువంటి సంబంధం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో  36 మందిని నిందితులు, అనుమానితులుగా గుర్తించిన ఈడీ…వారంతా 170 ఫోన్లు వాడినట్టుగా తెలిపారు.  ఇప్పటివరకు  కేవలం 17 ఫోన్లు మాత్రమే ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మిగతా ఫోన్ల ఆచూకీ లభ్యం కావాల్సి ఉంది. ప్రధానంగా ఈడీ అధికారులు కవితను ఫోన్ల చుట్టే ప్రశ్నించనున్నారని తెలుస్తోంది. 

అయితే  తదుపరి విచారణ ఎప్పుడు ఉంటుందనేది మాత్రం ఈడీ అధికారులు స్పష్టత ఇవ్వలేదు. బుధవారం  ఉగాది పండగ సందర్భంగా విచారణ ఉండదన్నది అధికారులు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.