ఆకాల వర్షాలతో హైదరాబాద్ లో వైరల్ జ్వరాల పంజా

గ్రేటర్‌లో హైదరాబాద్ లో కురుస్తున్న ఆకాల వర్షాలకు వైరల్ ఫీవర్లు పంజా విసరడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు రోగులతో రద్దీగా మారాయి. పెద్దలతో పాటు చిన్నారులకు దగ్గు, జలులు, జ్వరాలు సోకడంతో నాలుగు రోజుల నుంచి ఉస్మానియా, గాంధీ, ఫీవర్ ఆసుపత్రులతో పాటు బస్తీదవఖానల ఓపికి తాడికి పెరిగింది.

రోగుల సంఖ్య రోజు రోజుకు పెరగడంతో ఆసుపత్రుల సిబ్బంది సకాలంలో పరీక్షలు, వైద్య సేవలు అందించలేక పోతున్నారు. ఆలస్యంగా చికిత్స అందిస్తుండటంతో సిబ్బందిపై రోగులు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉన్నవారు సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారు.

మూడు రోజులుగా ఫీవర్ ఆసుపత్రికి 400 మంది, ఉస్మానియా 600, గాంధీ 750, బస్తీదవఖానలకు రోజుకు 80 మందికి పైగా వస్తున్నట్లు ఆసుపత్రుల ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. వాతావరణ ప్రభావంతో వైరల్ ఫీవర్లు వారం రోజుల వరకు ప్రజలపై పంజా విసురుతాయని ప్రజలు జాగ్రత్తలు పాటించకుంటే ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు.

వ్యాధులు విస్తరించకుండా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా వైద్య సిబ్బందితో జ్వర సర్వే చేయిస్తున్నట్లు, దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలు కనిపిస్తే వారికి పరీక్షలు చేసి మందులు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడిస్తున్నారు. ప్రధానంగా రోడ్లపై మురుగునీరు, చెత్త చెదారం నిల్వ ఉండటంతో దోమలు వ్యాప్తి చెందిన రాత్రింబళ్లు తేడా లేకుంటే కాటు వేస్తుండటంతో జ్వరాల కేసులు ఎక్కువ నమోదైతున్నట్లు వెల్లడిస్తున్నారు.

నగర ప్రజలు పగలు దోమ కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. శుభ్రమైన నీటిని వేడిచేసి తాగాలి, నీటి తొట్టెలు, ట్యాంకులపై మూతలు ఉంచాలి. పాత్రలు, బిందెల్లో నీరు నిల్వ ఉంచరాదు. చీకటి పడితే శరీరానికి పూర్తిగా కప్పిన దుస్తులు ధరించాలి. దోమతెరలను తప్పనిసరిగా వాడాలి.  ఇంటిలోపల, బయట పనికిరాని చెత్తను ఉంచకూడదు. ఉదయం సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల సమయంలో తలుపులు కిటీకీలు మూసివేయాలి. జీహెచ్‌ఎంసీ సిబ్బంది పరిసరాలను పాగింగ్ చేయించాలని జిల్లా వైద్యశాఖ సూచించింది.