పతనం అంచుల్లో స్వీస్‌కు చెందిన బ్యాంక్‌ క్రెడిట్‌ సూయిస్‌

అమెరికాలో రెండు బ్యాంక్‌ల పతనం తరువాత స్వీస్‌కు చెందిన దిగ్గజ బ్యాంక్‌ క్రెడిట్‌ సూయిస్‌ కూడా సంక్షోభం దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. క్రెడిట్‌ సూయిస్‌ పతనమైతే ఆ ప్రభావం యూరోపియన్‌ ఆర్ధిక వ్యవస్థ, బ్యాంకింగ్‌ వ్యవస్థపై తీవ్ర స్థాయిలో ప్రభావం పడుతుందని ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ప్రస్తుతం దివాళా అంచున ఉంది.

క్రెడిట్‌ సూయిస్‌ను కొనుగోలు చేసే అంశాన్ని యూబీఎస్‌ గ్రూప్‌ పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. క్రెడిట్‌ సూయిస్‌ మోత్తాన్ని, లేదా కొన్ని వ్యాపారాలను కొనుగోలు చేసే మార్గాలను ఈ గ్రూప్‌ అన్వేషిస్తోంది. స్విస్‌ అధికారుల ప్రోత్సహంతోనే యూబీఎస్‌ గ్రూప్‌ ఈ దిశగా ప్రయత్నాలు చేస్తోందని సమాచారం.

ఈ వారంలో రెండు బ్యాంక్‌ల బోర్డులు స్విస్‌ నేషనల్‌ బ్యాంక్‌, అక్కడి నియంత్రణ సంస్థ ఫిన్మాతో వేరువేరుగా చర్చలు జరిపాయి. ఆదివారం నాటికి ఈ రెండు బ్యాంక్‌ల మధ్య డీల్‌ ప్రకటించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ వారం క్రెడిట్‌ సూయిస్‌ సంస్థ ఆర్ధికంగా బలహీనంగా ఉందనే విషయం బయటకు వచ్చింది.

అయితే సంవత్సర కాలంగా ఈ బ్యాంక్‌ ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ బ్యాంక్‌లో ప్రధాన వాటాదారైన సౌదీ నేషనల్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌ అమ్మర్‌ అల్‌ కుదైరీ ఇటీవల మాట్లాడుతూ రెగ్యులేటరీ ఇబ్బందుల వల్ల క్రెడిట్‌ సూయిస్‌లో పెట్టుబడి పెట్టబోమని ప్రకటించారు. ఈ ప్రకటనతో క్రెడిట్‌ సూయిస్‌ షేరు ధర పతనమైంది. 2021 ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఈ షేరు 85 శాతం తగ్గింది.

దీని ప్రభావంతో యూరోపియన్‌ మార్కెట్‌లో ఇతర బ్యాంక్‌ల షేర్లు కూడా పతనమయ్యాయి. స్విస్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ నుంచి 4.43 లక్షల కోట్లు(54 బిలియన్‌ డాలర్లు) రుణం పొందడం ద్వారా ఆర్ధిక మూలాలను బలోపేతం చేసుకుంటున్నట్లు క్రెడిట్‌ సూయిస్‌ ప్రకటించింది. దీంతో బ్యాంక్‌ షేర్లు స్వల్పంగా లాభపడింది.

మన దేశంపై ప్రభావం మన దేశ బ్యాంకింగ్‌ వ్యవస్థకు దగ్గరి పోలికలు ఉన్నప్పటికీ క్రెడిట్‌ సూయిస్‌ పతన ప్రభావం మన దేశ బ్యాంకింగ్‌ వ్యవస్థపై చాలా స్వల్పంగా ఉంటుందని జెఫరీస్‌ ఇండియా నివేదిక పేర్కొంది. ఈ బ్యాంక్‌ మన దేశంలో పరిమితంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ పతనం కంటే క్రెడిట్‌ సూయిస్‌ పతనం భారత బ్యాంకింగ్‌ వ్యవస్థకు ఎంతో కీలకమైనదని ఈ నివేదిక స్పష్టం చేసింది.

స్విట్జర్లాండ్‌కు చెందిన క్రెడిట్‌ సూయిస్‌ బ్యాంక్‌కు మన దేశంలో 20 వేల కోట్ల అసెట్స్‌ ఉన్నాయి. డిరవేటీవ్‌ మార్కెట్‌లోనూ స్వల్పంగా దీని ప్రభావం ఉంది. అసెట్స్‌లో 60 శాతం రుణాలు ఉన్నాయి. మనదేశంలో కేవలం ఒకే బ్రాంచ్‌ కలిగి ఉంది. ఈ విషయంలో ఆర్బీఐ పరిస్థితిని నిశితంగా గమనిస్తుందని నిపుణులు స్పష్టం చేశారు.

లిక్విడిటీ సమస్యలు, కౌంటర్‌ పార్టీ ఎక్స్‌పోజర్‌పై ఆర్బీఐ ప్రధానంగా పరిశీలన జరుపుతున్నది. సంక్షోభం మూలంగా ఈ బ్యాంక్‌లో ఉన్న డిపాజిట్లు క్రమంగా పెద్ద బ్యాంక్‌లకు తరలివెళ్లే అవకావం ఉందని నివేదిక అంచనా వేసింది. మన దేశంలో విదేశీ బ్యాంక్‌ల కార్యకలాపాలు పరిమితంగానే ఉన్నందున వీటి ప్రభావం అంతగా ఉండదని భావిస్తున్నారు. ఈ బ్యాంక్‌ల పనతం నుంచి మాత్రం ఇండియన్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థ పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుందని నిపుణులు స్పస్టం చేస్తున్నారు.