10 వికెట్ల తేడాతో టీమిండియాఫై ఆస్ట్రేలియా ఘన విజయం

విశాఖ వేదికగా జరిగిన ఆస్ట్రేలియా – భారత్ మ్యాచ్ లో 10 వికెట్ల తేడాతో ఇండియాఫై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 26 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌట్ కాగా,  ఆసీస్ 11 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. టీమిండియా బౌలర్లు కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేక ఉసూరుమనిపించారు.

ఓపెన‌ర్లు మిచెల్ మార్ష్‌(66) ట్రావిస్ హెడ్ (51) అర్ధ శ‌త‌కాల‌తో చెల‌రేగారు. వీళ్లిద్ద‌రూ టీ20 త‌ర‌హాలో బ్యాటింగ్ చేయ‌డంతో ఆసీస్ మ‌రో 234 బంతులు ఉండ‌గానే టార్గెట్‌ను ఛేదించింది. తొలి వ‌న్డేలో గెలిచి ఊపు మీదున్న భార‌త్‌కు షాక్. రెండో వ‌న్డేలో విజ‌యం సాధించి సిరీస్ వ‌శం చేసుకోవాల‌నుకున్న టీమిండియా ఆశ‌ల‌పై ఆసీస్ నీళ్లు చ‌ల్లింది.

 మార్ష్ 36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 66 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరో ఎండ్ లో ట్రావిస్ హెడ్ కూడా అర్ధసెంచరీ సాధించాడు. హెడ్ 30 బంతుల్లో 10 ఫోర్లు బాది 51 పరుగులు నమోదు చేశాడు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ ను ఆసీస్ 1-1తో సమం చేసింది.  రెండో వన్డేలో అటు బౌలింగ్‌లోనూ, ఇటు బ్యాటింగ్‌లోనూ ఆసీస్ ఆల్ రౌండ్‌ షోతో సత్తా చాటింది.

ఆసీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 117 పరుగులకే ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ 4 కీలక వికెట్లు పడగొట్టి టీమిండియాను గట్టి దెబ్బ కొట్టాడు.  రోహిత్ శర్మ, గిల్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ వికెట్లను తీసి టీమిండియాను స్టార్క్ బెంబేలెత్తించాడు. చివర్లో మహ్మద్ సిరాజ్ వికెట్‌ను కూడా స్టార్క్ తీశాడు. దీంతో.. ఈ ఆసీస్ బౌలర్ ఖాతాలో 5 వికెట్లు పడటం గమనార్హం.

టీమిండియాలో సగం మందిని ఇతనే కూల్చేశాడు. అబాట్‌ కూడా 3 వికెట్లతో రాణించాడు. ఎల్లిస్‌కు రెండు వికెట్లు దక్కాయి. మొత్తంగా చూసుకుంటే.. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి టీమిండియా విలవిలలాడిపోయింది. ఇక చివరిదైన మూడో వన్డే ఈనెల 22న చెన్నైలో జరగనుంది. మొద‌ట బ్యాటింగ్ చేసిన‌ టీమిండియా 117 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. స్వ‌దేశంలో మూడో అత్య‌ల్ప స్కోర్ న‌మోదు చేసింది. పిచ్ పేస్‌కు అనుకూలించడంతో ఆ జ‌ట్టు స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ చెల‌రేగిపోయాడు. అత‌ని ధాటికి టాపార్డ‌ర్ కుప్ప‌కూలింది.