126 రోజుల తరువాత మళ్లీ భారీగా పెరిగిన కరోనా

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. 126 రోజుల తర్వాత రోజువారీ కేసుల నమోదు ఎనిమిది వందలు (800) దాటటంతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ ప్రకటించింది. ప్రతి రోజూ బాధితులు పెరుగుతూ ఉండటంపై అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తుంది. జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తుంది.
 
వాతావరణ మార్పులు.. ఇతర వైరస్ లతో జనం ఇబ్బంది పడుతున్న సమయంలోనే.. కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశమే.కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం శనివారం దేశంలో కొత్తగా 843 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 5,839 కి చేరింది. గత నాలుగు నెలలకంటే ఇప్పుడే అత్యధికంగా నమోదవుతున్నాయని ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తం చేసింది.

తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4.46 కోట్లకు (4,46,94,349) చేరింది. కొత్తగా నలుగురు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,799 కి చేరింది. తాజాగా జార్ఖండ్, మహారాష్ట్రల్లో ఒక్కొక్కరు, కేరళలో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటివరకు 4,41,58,161మంది వైరస్ నుంచి కోలుకున్నారు.

రికవరీ రేటు 98.80 శాతం ఉండగా, మరణాల రేటు 1.19 శాతంగా ఉందని ఆరోగ్య శాఖ తెలియజేసింది. ఇప్పటివరకు 220.64 కోట్ల డోసుల వ్యాక్సిన్ వేసినట్టు వివరించింది. దేశంలో సగటు రోజువారీ కరోనా కేసులు నెలలో ఆరు రెట్లు పెరిగాయి. సగటు రోజువారీ కొత్త కేసులు నెల కిందట ఫిబ్రవరి 28న 112 కేసులు ఉండగా, ఇప్పటికి 800 దాటడం గమనార్హం.

కేంద్ర ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం.. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌ రాష్ట్రాల్లోనే కరోనా కేసులు అత్యధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. మరోవైపు అనేక రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండటంతో మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, తదితర ఆరు రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరికలతో లేఖలు రాసింది.

మార్చి నెలలో సగటున 626 కేసులు నమోదవుతున్నాయి. ఒక్క మార్చి నెలలోనే కరోనా కేసుల సంఖ్య సుమారు ఆరు రెట్లు పెరిగింది. అయితే కరోనా రికవరీ రేటు 98 శాతం, మరణాల రేటు శాతం 1.19 శాతంగా నమోదవుతుందని ఆరోగ్యమంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌ సూచిస్తుంది. వైరస్ వ్యాప్తిని నివారించేందుకు రిస్క్ అసెస్‌మెంట్ ఆధారిత విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని , కొన్ని రాష్ట్రాల్లో కరోనా పాజిటివిటీ రేటు క్రమంగా పెరుగుతోందని సూచిస్తూ ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ శనివారం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలు రాశారు.