జమిలి ఎన్నికలు జరపాలన్నదే ఉద్దేశం .. కేంద్రం స్పష్టం

లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరపాలనేదే తమ ఉద్దేశమని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా నిధులు ఆదా అవుతాయని పేర్కొంది. అయితే జమిలి ఎన్నికలు నిర్వహించడానికి రాజ్యాంగాన్ని సవరించడంతో పాటుగా అన్ని రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకు రావడం వంటి పలు అత్యవసర చర్యలు తీసుకోవలసి ఉందని పేర్కొంది.

ఎన్నికల కమిషన్ లాంటి పలు భాగస్వాములతో చర్చించి పార్లమెంటరీ కమిటీ జమిలి ఎన్నికల నిర్వహణ అవశాన్ని పరిశీలించిందని శుక్రవారం లోక్‌సభలో ఒక లిఖిత పూర్వక సమాధానంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు తెలిపారు.

జమిలి ఎన్నికల నిర్వహణకు ఆచరణాత్మకమైన రోడ్‌మ్యాప్‌ను, నిబంధనావళిని రూపొందించడం కోసం ప్రస్తుతం ఈ అంశాన్ని లా కమిషన్‌కు నివేదించడం జరిగిందని రిజిజు తన సమాధానంలో తెలిపారు. జమిలి ఎన్నికల వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ మొత్తం ఆదా అవడంతో పాటుగా పాలనా యంత్రాంగం, శాంతిభద్రతల యంత్రాంగంపై అదనపు పనిభారం తగ్గుతుందని చెప్పారు.

అలాగే రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు ఎన్నికల ప్రచారం సమయంలో పెద్ద ఎత్తున సొమ్ము కూడా అవుతందని రిజిజు తన సమాధానంలో తెలియజేశారు. అయితే లోక్‌సభ, రాష్ట్రాల శాసన సభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడానికి ప్రధానంగా అడ్డంకిగా ఉన్న అంశాలను కూడా మంత్రి వివరించారు. ముఖ్యంగా కనీసం 5 రాజ్యాంగ అధికరణాలకు సవరణలు తీసుకు రావలసి ఉంటుందని ఆయన తెలిపారు.

పార్లమెంటు ఉభయ సభల గడువుకు సంబంధించిన ఆర్టికల్ 83, అలాగే లోక్‌సభను రాష్ట్రపతి రద్దు చేయడానికి సంబంధించిన ఆర్టికల్ 85, అలాగే రాష్ట్ర చట్టసభల పదవీ కాలానికి సంబంధించి 172వ అధికరణం, వాటి రద్దుకు సంబంధించిన 174 అధికరణం, చివరగా రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనకు సంబంధించిన ఆర్టికల్ 356కు సవరణలు చేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.

అంతేకాకుండా అన్ని రాజకీయ పార్టీల ఆమోదాన్ని కూడా పొందాల్సి ఉంటుందని మంత్రి తెలిపారు.‘ మనది ఫెడరల్ వ్యవస్థ అయినందున అన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదాన్ని కూడా పొందాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. అన్నిటికీ మించి భారీ మొత్తంలో ఎలక్ట్రాలనిక్ ఓటింగ్ యంత్రాలు (ఇవిఎం), వివిప్యాట్‌లను సమకూర్చుకోవలసి ఉంటుందని, ఇందుకు వేల కోట్ల రూపాయల ఖర్చవుతుందని కూడా ఆయన వివరించారు.