లోక్‌సభ నుండి రాహుల్ కు బహిష్కరణ ముప్పు!

లండన్‌లో భారత ప్రజాస్వామ్యం గురించి చేసిన వాఖ్యలు గత నాలుగు రోజులుగా పార్లమెంట్ లో దుమారం రేపుతుండగా ఈ విషయమై ఆయన లోక్‌సభ నుండి బహిష్కరణ ముప్పు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. భారత్‌లో ప్రజాస్వామ్యంపై క్రూరమైన దాడి జరుగుతోందని ఆయన కేంబ్రిడ్జి వర్సిటీలో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది.

విదేశీ గడ్డపై భారత్‌ను అవమానించారని.. ఇందుకు ఆయన క్షమాపణ చెప్పాలని.. అప్పటిదాకా ఆయన్ను సభలో మాట్లాడనిచ్చేది లేదని స్పష్టం చేస్తోంది. వేరే దేశానికి వెళ్లి ఇక్కడ ప్రజాస్వామ్యం బాగాలేదని చెప్పడానికి రాహుల్‌కు ఎంత ధైర్యం? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఆయన తన తప్పిదాన్ని చక్కదిద్దుకుంటేనే మాట్లాడేందుకు వీలేర్పడుతుందని బిజెపి తెలిపింది.

కాగా, అదానీ అంశం నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి బీజేపీ రాహుల్ ను సభ నుండి బహిష్కరించే ప్రయత్నం చేస్తున్నదని  కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. తన ‘అధికార పరిధికి మించి’(బియాండ్ ప్రివిలేజ్)గా పేర్కొంటూ లోక్‌సభ నుంచి వయనాడ్ ఎంపీ అయిన రాహుల్ గాంధీని సస్పెండ్ చేయాలని బిజెపి ఇటీవల కోరింది.

గతంలో నాటి రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి 1976లో యుకె, యుఎస్, కెనడాలలో భారత దేశానికి సంబంధించిన కొన్ని వ్యాఖ్యలకు గాను సభ నుంచి బహిష్కరణకు గురయ్యారు. రాహుల్‌ పార్లమెంటుకు అతీతుడు కాదని, క్షమాపణ చెప్పి తీరాలని కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, కిరెన్‌ రిజిజు, పీయూష్ గోయల్‌ డిమాండ్‌ చేశారు.

‘దేశానికి సంబంధించిన ఏదైనా విషయం అందరికీ ఆందోళన కలిగిస్తుంది. కాంగ్రెస్‌కు లేదా దాని నాయకత్వానికి ఏమి జరుగుతుందో మేము పట్టించుకోము. కానీ అతను దేశాన్ని అవమానిస్తే, మేము మౌనంగా ఉండలేము’ అని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఇదివరలో స్పష్టం చేశారు.

రాహుల్‌ వ్యాఖ్యలపై ప్రత్యేక పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసి విచారించాలని.. దాని నివేదిక ఆధారంగా ఆయనను సభ నుంచి బహిష్కరించవచ్చేమో పరిశీలించాలని బీజేపీ ఎంపీ నిశికాంత్‌ దూబే స్పీకర్‌ ఓం బిర్లాకు తాజాగా లేఖ రాశారు. లోక్‌సభ విధివిధానాలు, ప్రవర్తనా నియమాల నిబంధన 223 కింద ఆయన ఈ లేఖను  రాశారు.

రూల్ 223(పార్లమెంటరీ) ప్రత్యేక హక్కు గురించి చర్చిస్తుంది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ చేసిన ప్రసంగం సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ మూడు అధికారాలను ఉల్లంఘించారని ప్రివిలేజెస్ కమిటీ ముందు దూబే వాదించారు. ముందస్తు నోటీసు లేకుండా పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీపై వ్యాఖ్యలు చేయడం ద్వారా రాహుల్ గాంధీ రూల్ 352ను ఉల్లంఘించారని దూబే ఆరోపించారు.

కేంబ్రిడ్జి వర్శిటీలో వ్యాఖ్యలకు రాహుల్ వెంటనే క్షమాపణలు చెప్పాల్సి ఉందని బిజెపి ఓ వైపు, అదానీ హిండెన్‌బర్గ్ నివేదికపై జెపిసి దర్యాప్తునకు విపక్షాలు పట్టుపట్టడంతో , అరుపులు కేకలు సభలో గందరగోళం నడుమ ఉభయసభలు నాలుగు రోజులుగా వాయిదాపడుతూ వస్తున్నాయి. రాహుల్ క్షమాపణలు తెలియజేయకపోతే ఇకపై కూడా అంటే వచ్చే వారం కూడా ఇదే విధంగా తమ పట్టు ఉంటుందని బిజెపి స్పష్టం చేసింది.