
అల్పపీడన ద్రోణి కారణంగా హైదరాబాద్ లో శనివారం సాయంత్రం పలు ప్రాంతాల్లో వడగండ్త తో కూడిన భారీ వర్షం కురిసింది. సాయంత్రం 5.30 తర్వాత ఒక్కసారిగా ఆకాశం మేఘావృతం అయింది. ఉరుములతో కూడిన వడగండ్ల వాన కురిసింది. కుండపోత వర్షం పడుతుంది. దీంతో వివిధ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
రోడ్లలో వాన నీరు నిలిచిపోయిన కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. నగరంలోని రోడ్లు మొత్త జలమయమయ్యాయి. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కావటంతో.. రాకపోకలకు ఇబ్బంది తలెత్తుతోంది. నగరంలోని కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ పరిసర ప్రాంతాల్లో వడగండ్ల వాన కురుస్తోంది.
పంజాగుట్ట, అమీర్‌పేట్, ఖైరతాబాద్, మెహిదీపట్నం, బంజారాహిల్స్, జుబ్లీహిల్స్ లో భారీ వర్షం కురుస్తోంది. బహదూర్‌పురా, ఫలక్ నుమా, సికింద్రాబాద్, ప్యాట్నీసెంటర్, బేగంపేట, అల్వాల్‌లో వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. చిలకలగూడ, తిరుమలగిరి, బోయిన్‌పల్లి, మారేడుపల్లి, ఓయూక్యాంపస్, హబ్సీగూడ, నాచారం, మల్లాపూర్ ప్రాంతాల్లో వర్షం పడుతోంది.
జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో కూడా పలుచోట్ల వాన పడడ్డంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాతావరణ శాఖ మార్చి 16 నుంచి 17 వరకు ఆరెంజ్ అలర్ట్, మార్చి 20 వరకు యెల్లో అలర్ట్ ప్రకటించింది. ఉరుములతో కూడిన వడగండ్ల వానలు కురియవచ్చని, గంటకు 30 నుంచి 40 కిమీ. వేగంతో ఈదురు గాలులు వీచనున్నాయని హెచ్చరించింది.
రాబోయే 48 గంటలు ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని పేర్కొన్నది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 31.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు తెలిపింది. ఆరు జోన్లయిన చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్‌బి నగర్, సికింద్రాబాద్, షేర్లింగంపల్లిల్లో ఆకాశం మేఘావృతంగా ఉండనున్నది. ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువ ఉండనున్నది.
మరో రెండు రోజుల పాటు అటు హైదరాబాద్‌తో పాటు ఇటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అవసరం ఉంటే తప్ప బయటకి రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకన్ తీరం వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. ఈ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
More Stories
అరెస్ట్ చేయొద్దన్న కవిత అభ్యర్థనకు `సుప్రీం’ తిరస్కరణ
రెండు రోజులు వర్షాలు పడే అవకాశం
జైలులో బిజెవైఎం నేతలను పరామర్శించిన కిషన్ రెడ్డి