
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జాతీయ వ్యతిరేక టూల్‌కిట్ లో భాగంగా మారిపోయారని బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో భాగస్వామి కావడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. జేపీ నడ్డా ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ‘‘కాంగ్రెస్ పార్టీ దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాలుపంచుకుంటుండటం దురదృష్టకరం. దేశం పదే పదే తిరస్కరిస్తుండటంతో రాహుల్ గాంధీ ఇప్పుడు దేశ వ్యతిరేక టూల్‌కిట్‌లో భాగస్వామిగా మారారు’’ అంటూ ధ్వజమెత్తారు.
భారత దేశ అంతర్గత వ్యవహారాల్లో వేరొక దేశం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేయడం వెనుక ఉద్దేశం ఏమిటని ఆయన రాహుల్ గాంధీని ప్రశ్నించారు. భారత దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఐదో స్థానంలో నిలిచే దిశగా దూసుకెళ్తోందని, మరోవైపు జీ20 సమావేశాలు మన దేశంలో జరుగుతున్నాయని ఆయన గుర్తు చేశారు.
ఇటువంటి పరిస్థితుల్లో ఆయన విదేశాలకు వెళ్లి, భారతదేశాన్ని, పార్లమెంటును అవమానించారని నడ్డా మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఇటీవల లండన్‌లో మాట్లాడుతూ, భారత దేశ ప్రజాస్వామిక మౌలిక నిర్మాణం దాడికి గురవుతోందని, పార్లమెంటులో ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు. అన్ని వ్యవస్థల్లోనూ బీజేపీ, ఆరెస్సెస్ చొచ్చుకెళ్లాయని ఆరోపించారు. ఈ ఆరోపణలపై క్షమాపణ చెప్పాలని పార్లమెంటులో బీజేపీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
More Stories
అరుణాచల్ పై ‘జీ20’ సాక్షిగా చైనాకు భారత్ ఝలక్
సావర్కర్ పై రాహుల్ వాఖ్యలపట్ల ఉద్ధవ్ ఆగ్రహం!
రాజకీయాల్లోకి సుష్మా స్వరాజ్ కూతురు బాన్సురీ