పారిశ్రామిక హోదాతో పర్యాటక రంగం మరింతగా రాణిస్తుంది

పర్యాటక రంగానికి రాష్ట్రాలు పారిశ్రామిక హోదా కల్పిస్తే ఆ రంగం మరింతగా రాణిస్తుందని పర్యాటక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు. రాజ్యసభలో గురువారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలదేనని గుర్తు చేశారు.
 
 పరిశ్రమ హోదా పొందడం ద్వారా పర్యాటక రంగం దాని అనుబంధ రంగాలు ఇతర పరిశ్రమలతో సమానంగా విద్యుత్‌ చార్జీలు, ఇతర పన్నుల వంటి ద్వారా లబ్ది పొందే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. ప్రస్తుతానికి పర్యాటక రంగం వాణిజ్యం కేటగిరిలో ఉన్నందున అధిక రేట్లను చెల్లించాల్సి వస్తోందని మంత్రి పేర్కొన్నారు.
 
పర్యాటకానికి పరిశ్రమ హోదా కల్పిస్తే  భారీ పెట్టుబడులు అవసరమయ్యే ఆతిథ్య రంగంలో పెట్టుబడి ఖర్చు గణనీయంగా తగ్గి ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులకు ప్రోత్సాహకారిగా మారుతుందని తేల్చి చెప్పారు.  దేశంలో ఇప్పటికే గుజరాత్‌, కేరళ, రాజస్థాన్‌, పంజాబ్‌, గోవా, కర్నాటక, ఉత్తరాఖండ్‌, మహారాష్ట్ర, జమ్మూ,కాశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, త్రిపుర వంటి పదకొండు రాష్ట్రాలు పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించినట్లు మంత్రి తెలిపారు.
 
మిగిలిన ఇతర రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించాల్సిందిగా తమ మంత్రిత్వ శాఖ పదేపదే సలహా ఇస్తోందని చెప్పారు. ఆయా రాష్ట్రాల అధికారులతో ఉన్నత స్థాయిలో జరిగే ఇంటరాక్టివ్‌ సెషన్స్‌లోను, సమావేశాలలోను, కరస్పాండెన్స్‌ ద్వారా వాటిని ఒప్పించే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నట్లు కిషన్‌ రెడ్డి వెల్లడించారు.