రూ.70,584 కోట్లతో ‘మిలటరీ హార్డ్‌వేర్‌’ కొనుగోలు

భారీగా రక్షణ, యుద్ధ సామగ్రి కొనుగోలుకు రక్షణ శాఖ గురువారం ఆమోదం తెలిపింది. మిలటరీ హార్డ్‌వేర్‌ పేరుతో రూ.70,584 కోట్ల విలువైన పలు రకాల ఆయుధాలు, ఇతర వనరులను కొనుగోలు చేయనుంది. ఇందులో నౌకాదళ ప్రతిపాదనలు రూ.56 వేల కోట్ల వరకున్నాయి.
వీటిలో అత్యధికంగా దేశీయంగా తయారైనవే.
 
రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన డిఫెన్స్‌ అక్విజిషన్‌ కౌన్సిల్‌ సమావేశం ఈ మేరకు ఆమోదం తెలిపింది. మెగా ప్రొక్యూర్‌మెంట్‌ ప్లాన్‌గా పేర్కొంటున్న ఈ ఆయుధ సామగ్రి సేకరణలో బ్రహ్మోస్‌ క్షిపణులు, మెరైన్‌ డీజి ల్‌ ఇంజన్లు, ఆర్టిలరీ గన్‌సిస్టంలు, ఎలక్ర్టానిక్‌ వార్‌ఫేర్‌ సూట్లు, హెలికాప్ట ర్లున్నాయి.
నౌకాదళానికి శక్తి ఎలక్ర్టానిక్‌ వార్‌ఫేర్‌ సిస్టం, మారిటైమ్‌ హెలికాప్టర్లు, ఇతర పరికరాలను కొనుగోలు చేయనున్నారు.
వీటిలో మీడియం స్పీడ్‌ మెరైన్‌ డీజిల్‌ ఇంజన్‌ కొనుగోలు ప్రాధాన్యం సంతరించుకొంది. దీన్ని తొలిసారిగా దేశంలో తయారు చేయడం విశేషం. బ్రహ్మోస్‌ క్షిపణులు, యుటిలిటీ హెలికాప్టర్లతో నౌకాదళ యుద్ధ సామర్థ్యం, సన్నద్ధత మెరుగవుతుంది. కోస్టుగార్డు కోసం హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ నుంచి అడ్వాన్స్‌ లైట్‌ హెలికాప్టర్లు కొనుగోలు చేస్తారు. ఇందులో నిఘా పరికరాలు, సెన్సార్లు ఉంటాయి.
 
ఆర్మీ కోసం లాంగ్‌ రేంజ్‌ స్టాండ్‌ ఆఫ్‌ వెపన్‌(ఎల్‌ఆర్‌ఎ్‌సఓడబ్ల్యూ), కె-9 వజ్ర-టి గన్‌ సిస్టం, 115ఎంఎం/52 కేలిబర్‌ అడ్వాన్స్‌డ్‌ టవ్‌డ్‌ ఆర్టిలరీ గన్‌ సిస్టం, గన్‌ టవరింగ్‌ వెహికల్స్‌ సేకరించనున్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ఓడబ్ల్యూలను దేశంలోనే తయారు చేశారు.  వీటిని ఎస్‌యూ-30 ఎంకెఐ విమానాలకు అనుసంధానం చేయనున్నారు. గత మూడేళ్లుగా లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వద్ద వివాదం నెలకొన్న నేపథ్యంలో ఈ కొనుగోళ్లకు ప్రాధాన్యం ఏర్పడింది. 2022-23లో ఇలాంటి యుద్ధ సామగ్రి కొనుగోలుకు రూ.2,71,538 కోట్లు కేటాయించారు.