
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టు కోసం ఆ దేశ పోలీసులు జరిపిన ఆపరేషన్ విఫలమైంది. లాహోర్‌లో ఆయన్ను నిర్బంధించేందుకు రెండు రోజులపాటు పోలీసులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. వారి ఉద్దేశ్యం కేవలం తనను అరెస్ట్ చేయడం కాదని, తనను ఎత్తుకెళ్లి చంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఈ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు.
మంగళవారం రాత్రి ఇమ్రాన్‌ను అరెస్టు చేయలేకపోయిన పోలీసులు, తిరిగి బుధవారం ఉదయం మళ్లీ భారీ సంఖ్యలో ఆయన ఇంటికి చేరుకున్నారు.
అయితే పీటీఐ పార్టీ కార్యకర్తలు రెండోరోజు కూడా తిరగబడి పోలీసుల్ని తరిమికొట్టారు. పోలీసులు నిష్క్రమించిన తర్వాత ఇమ్రాన్ ఖాన్ గ్యాస్ మాస్క్ పెట్టుకుని బయటకు వచ్చి కార్యకర్తలతో ముచ్చటించారు. తోషాఖానా కేసులో ఇమ్రాన్ అరెస్టు వారెంట్ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆయన్ను అరెస్టు చేసేందుకు మంగళవారం పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ మద్దతుదారులు పోలీసుల్ని అడ్డుకున్నారు. టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. ఓ దశలో కాల్పులు కూడా జరిగాయి. అయినా ఇమ్రాన్ ఇంట్లోకి పోలీసులు వెళ్లలేకపోయారు. ఈ మొత్తం ఘర్షణల్లో ఇస్లామాబాద్ డీఐజీ ఆపరేషన్స్ షాజామ్ నదీమ్ బుఖారీతో పాటు 54 మంది పోలీసులు గాయపడ్డారు.
బుధవారం ఉదయం నుంచి పలు మార్లు ఇమ్రాన్ తన పార్టీ ట్విట్టర్‌లో కొన్ని పోస్టు పెట్టారు. భారీ సంఖ్యలో పోలీసులు తన ఇంటిపై సంధించిన టియర్ గ్యాస్ షెల్స్ ను ఆయన చూపించారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఆయన ప్రజెంట్ చేశారు. తనకు సమాచారం ఇవ్వకుండానే అకస్మాత్తుగా తనను అరెస్టు చేసేందుకు పోలీసులు వచ్చినట్లు ఇమ్రాన్ ఒక ఇంటర్వ్యూలో ధ్వజమెత్తారు.
తనను అరెస్టు చేసేందుకు పోలీసులు వస్తున్నట్లు న్యూస్‌లో చూశామని చెబుతూ తాను అరెస్టు కావడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. జైలు జీవితం గడిపేందుకు తాను మానసికంగా సిద్దమయ్యానని, ఎన్నాళ్లు జైలులో ఉంటానో తెలియదని పేర్కొన్నారు. అయితే, మార్చి 18వ తేదీ వరకు తాను ముందస్తు బెయిల్తీసుకున్నానని, కానీ 14వ తేదీన తనను ఎందుకు అరెస్టు చేయాలనుకున్నారో తెలియదని చెప్పారు.
కాగా, ఇమ్రాన్‌ఖాన్‌కి తాత్కాలిక ఊరట లభించింది. ఆయన నివాసం ఎదుట గురువారం ఉదయం 10 గంటల వరకు పోలీసులు చేపడుతున్న చర్యలను నిలిపివేయాలని లాహోర్ హైకోర్టు బుధవారం ఆదేశించింది. ఈ మేరకు లాహోర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ తారిఖ్ సలీమ్ షేక్ ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసుల చర్యలను సవాలు చేస్తూ పిటిఐ పార్టీ నేత ఫవాద్ చౌదరి లాహోర్ కోర్టును ఆశ్రయించారు.
ఈ ఘర్షణలతో ఇమ్రాన్ ఖాన్ ఇంటివద్ద గల జమాన్ పార్క్ రణరంగాన్ని తలపించింది. పీటీఐ మద్దతుదారులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ క్యాన్లు, టియర్ గ్యాస్ ఉపయోగిస్తున్నారు. అక్కడే గుమిగూడిన ప్రజలపై లాఠీఛార్జ్ చేస్తున్నారు. ఈ ఘర్షణలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు పాకిస్తాన్ వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి.
More Stories
అరుణాచల్ పై ‘జీ20’ సాక్షిగా చైనాకు భారత్ ఝలక్
అరెస్ట్ చేయొద్దన్న కవిత అభ్యర్థనకు `సుప్రీం’ తిరస్కరణ
ప్రపంచవ్యాప్తంగా ప్రమాదంలో ఆర్ధిక వ్యవస్థ