సిసోడియాపై సిబిఐ మరో కేసు నమోదు

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తీహార్ జైళ్లో ఉన్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై సిబిఐ గురువారం మరో కేసును నమోదు చేసింది.  ఢిల్లీ ఫీడ్‌బ్యాక్ యూనిట్‌‌లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై సీబీఐ సిసోడియాపై కేసు నమోదు చేసింది.2015లో ఆప్‌ ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన అనంతరం ఎఫ్‌బియుని ఏర్పాటు చేసింది.

ఫీడ్‌బ్యాక్‌ యూనిట్‌ను చట్టవిరుద్ధంగా సృష్టించడం, పని చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ. 36 లక్షల వరకు నష్టం వాటిల్లిందని సిబిఐ ఆరోపించింది. మనీష్‌ సిసోడియాతో సహా మొత్తం ఏడుగురిపై సిబిఐ కేసు ఫైల్‌ చేసింది. కేంద్రహోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఎ) ఫిబ్రవరిలో అవినీతి చట్ట కింద సిసోడియాను విచారణ చేసేందుకు అనుమతించిది. సిసోడియా ఎప్‌బియుని రాజకీయ ప్రత్యర్థులపై నిఘా కోసం వినియోగించారని సిబిఐ ఆరోపించింది.

సిసోడియాను ఇక జైలుకు పరిమితం చేసేందుకే మరో కేసు పెట్టారని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. మనీష్‌ సిసోడియా ఇప్పటికే ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.  మరోవైపు తీహార్ జైలులో సిసోడియాకు ‘భగవద్గీత’ను ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. ‘మెడిటేషన్ సెల్’కు అనుమతించాలని కూడా కోర్టును సిసోడియా కోరారు. సిసోడియా సీబీఐ కస్టడీ సోమవారంనాడు ముగుస్తుండటంతో ఆయనను రౌస్ ఎవెన్యూ కోర్టు ముందు మధ్యాహ్నం హాజరుపరిచారు. 

ఆయన కస్టడీ పొడిగింపును సీబీఐ కోరకపోవడంతో ఈనెల 20వ తేదీ వరకూ ఆయనను జ్యుడిషియల్ కస్టడీకి అప్పగిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి ఎంకె నాగ్‌పాల్ ఆదేశాలిచ్చారు.  వైద్య పరీక్షల్లో వైద్యులు సూచించిన మందులతో పాటు, కళ్లజోడు, డైరీ, ఒక పెన్ను, భగవద్గీత ప్రతిని సిసిడోయా తనతో తీసుకు వెళ్లేందుకు కోర్టు అనుమతించింది. తనను మెడిటేషన్ సెల్‌లో ఉంచాలంటూ సిసోడియా చేసిన విజ్ఞప్తిని పరిశీలించాలని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది.