వేగంగా విస్తరిస్తున్న హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుఎంజా వైరస్‌

ఇప్పుడిప్పుడే కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్నామంటే ఇప్పుడు దేశ వ్యాప్తంగా హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుఎంజా వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. తాజాగా ఈ వైరస్ బారిన పడిన ఓ మహిళ మరణించింది. దీంతో ఈ వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 7కు చేరుకుంది. జనవరి 1 నుంచి మార్చి 5 వరకు దేశంలో 451 హెచ్3ఎన్2 వైరస్ కేసులు నమోదయ్యాయి.

తాజాగా  గుజరాత్ లోని వడోదరలో 58 ఏళ్ల మహిళ హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుఎంజా వైరస్‌ కారణంగా చనిపోయింది. గత వారం కర్ణాటక, హర్యానాల్లో ఇదే వైరస్ బారిన పడి ఇద్ధరు మరణించారు. దేశంలోనే తొలిసారిగా కర్ణాటకలోని హసన్ లో 82 ఏళ్ల వ్యక్తి హెచ్3ఎన్2తో మృతి చెందాడు. మరోవైపు వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. హెచ్3ఎన్ 2 వైరస్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.  మాస్కులు ధరించాలని సూచించింది. మార్చి నెల చివరి వరకు ఈ వైరస్ కేసులు తగ్గుముఖం పడతాయని  తెలిపింది.

కరోనా లక్షణాలు ఉన్న హెచ్3ఎన్2 ఇన్‌ప్లూఎంజా వల్ల ప్రజలు ఆందోళన చెందున్నారు. శ్వాస సమస్యలతో ఆస్పత్రులకు క్యూ కడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ వైరస్ బారిన పడినవారు 3 నుండి 5 రోజుల వరకు జ్వరం, నిరంతర దగ్గు, చలి, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు కలిగి ఉంటున్నారు.
 
దీంతో పాటు గురక, ముక్కు కారటం, వికారం, గొంతు నొప్పి, శరీర నొప్పి కొన్ని సందర్భాల్లో అతిసార లక్షణాలు కూడా ఉంటున్నాయి.  మరోవైపు దేశవ్యాప్తంగా దగ్గు, జలుబు, వికారం వంటి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విచక్షణారహితంగా యాంటీబయాటిక్స్‌ వాడొద్దని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) హెచ్చరించింది.
రోగులకు ఉన్న లక్షణాల ఆధారంగా చికిత్సను సూచించాలని వైద్యులను కోరింది. ఈ ఇన్ఫెక్షన్‌ సాధారణంగా ఐదు నుంచి ఏడు రోజుల్లోపే తగ్గిపోతుందని, సీజనల్‌ జ్వరాలు మూడు రోజుల్లోనే తగ్గితే.. దగ్గు మాత్రం మూడు వారాల వరకూ కొనసాగుతుందని పేర్కొంది. వైరస్‌ బారిన పడకుండా పాటించాల్సిన జాగ్రత్తల జాబితాను ఐఎంసీఆర్‌ విడుదల చేసింది.