తాలిబన్ దౌత్యవేత్తలకు భారత్ శిక్షణ

తాలిబాన్ దౌత్యవేత్తలకు శిక్షణ ఇచ్చే కోర్సు ఒప్పందంపై భారత్ సంతకం చేసింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నిర్వహిస్తున్న ఈ నాలుగు రోజుల ఆన్‌లైన్ కోర్సు ‘ఇమ్మర్సింగ్ విత్ ఇండియన్ థాట్స్’లో మొదటిసారిగా కాబూల్‌లోని తాలిబాన్ ప్రభుత్వ సభ్యులు పాల్గొంటారు. ఈ కోర్సును ఐఐఎం కోజికోడ్ ద్వారా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు తాలిబన్లను గుర్తించని భారత్ వారి కోసం ఈ కోర్సును ప్రారంభించడం గమనార్హం. సోమవారం ప్రారంభమయ్యే ఈ కోర్సులో పలు దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటున్నారు.
 
ఐఐఎం కోజికోడ్ అందిస్తున్న ఈ కోర్సు కోసం ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ ప్రోగ్రామ్‌లోని అన్ని భాగస్వామ్య దేశాలను విదేశాంగ శాఖ ఆహ్వానించింది. ‘భారతదేశం విశిష్టత భిన్నత్వంలో ఏకత్వం.. ఇది బయటి వ్యక్తులకు సంక్లిష్టమైన అంశంగా కనిపిస్తుంది.. గందరగోళంగా ఉన్న విదేశీ అధికారులు దీని గురించి లోతుగా అవగాహన చేసుకోడానికి వీలు కల్పిస్తుంది.. తద్వారా భారత్‌లోని వాతావరణ పరిస్థితులను ప్రశంసించగలరు’ అని కోర్సు సారాంశం గురించి వివరించింది
 
కోర్సులో పాల్గొనేవారు భారత ఆర్థిక వాతావరణం, సాంస్కృతిక వారసత్వం, సామాజిక నేపథ్యంతో పాటు మరిన్ని అంశాలను తెలుసుకునే అవకాశం లభిస్తుందని తెలిపింది. ‘ఈ కోర్సులో పాల్గొనేవారికి భారత ఆర్థిక వాతావరణం, నియంత్రణ పర్యావరణ వ్యవస్థ, నాయకత్వ అంతర్దృష్టి, సామాజిక, చారిత్రక నేపథ్యం, సాంస్కృతిక వారసత్వం, చట్టపరమైన, పర్యావరణ ప్రకృతి దృశ్యం, వినియోగదారుల ఆలోచనలు, వ్యాపార నష్టాలను తెలుసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది’ అని పేర్కొంది.

ఈ కోర్సులో ప్రభుత్వ అధికారులు, వ్యాపారవేత్తలు, ఎగ్జిక్యూటివ్‌లు, వ్యవస్థాపకలు సహా గరిష్టంగా 30 మంది వరకూ పాల్గొనవచ్చు. ఇక, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అఫ్గనిస్థాన్ నుంచి ఎక్కువ సంఖ్యలో ఈ కోర్సులో పాల్గొంటున్నారు. ఆన్‌లైన్ కోర్సు కావడంతో భారత్‌కు వెళ్లే అవసరం ఉండదని, తాలిబన్‌లను ఏకాకి చేయడం కంటే వారికి అవగాహన కల్పించడం మంచిదని భావిస్తున్నారు.

 
తాలిబన్ విదేశాంగ శాఖ అధికారులు ఈ కోర్సులో చేరుతారని అఫ్గన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిప్లమసీ ఓ సర్క్యులర్ జారీచేసింది.  ఆగస్టు 2021లో అమెరికా సైన్యం వైదొలగిన తర్వాత అఫ్గన్‌ను తాలిబన్లు ఆక్రమించుకోవడంతో భారత్ సహా ప్రపంచ దేశాలు తమ రాయబార కార్యాలయాలను మూసివేశాయి.  కానీ, గతేడాది జులైలో కాబూల్‌లోని రాయబార కార్యాలయాన్ని భారత్ ప్రారంభించింది. సాంకేతిక బృందంగా పిలిచే రాయబార కార్యాలయం సిబ్బంది  అఫ్గన్ ప్రజలకు భారత్ అందిస్తున్న మానవతా సాయాన్ని నిశితంగా పరిశీలించడం, సమన్వయం చేయనున్నట్లు విదేశాంగ శాఖ పేర్కొంది.