పార్లమెంట్ లో రెండో రోజూ కొనసాగిన గందరగోళం

రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమై రెండు రోజులవుతున్నా ఎలాంటి చర్చలు లేకుండా పార్లమెంట్ లో ఉభయసభలు వాయిదా పడుతూ వస్తున్నాయి. అదానీ స్టాక్స్‌ వ్యవహారంపై ప్రతిపక్ష సభ్యులు, రాహుల్‌గాంధీ లండన్ ప్రసంగంపై అధికారపక్ష సభ్యులు పోటాపోటీ నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగుతుండటంతో సభలలో వాయిదాల పర్వం కొనసాగుతున్నది.
 
అధికార పక్షం, ప్రతిపక్షం సభ్యుల నిరసనల మధ్య పార్లమెంటు ఉభయసభలు బుధవారంకు వాయిదా పడ్డాయి. రాజ్యసభ మధ్యాహ్నం 2.00 గంటలకు తిరిగి సమావేశం కాగానే బిజెపి సభ్యులు, ప్రతిపక్ష సభ్యులు అరుస్తూ నిరసనలు తెలిపారు.
 
 బిజెపి సభ్యులు దేశంలోని ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లండన్‌లో చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా ప్రతిపక్షాలైన కాంగ్రెస్, వామపక్షాలు, డిఎంకె, టిఎంసి సభ్యుల అదానీ అంశంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జెపిసి) ఏర్పాటుచేయాలని కోరుతూ నినాదాలు చేశారు. ఇరుపక్ష సభ్యుల నిరసనలు కొనసాగుతుండడంపై రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్ సభను రేపటికి వాయిదా వేశాడు.
 
లోక్‌సభలో కూడా ఏ కార్యక్రమం కొనసాగకుండా ఇలా రెండో రోజు కూడా వృథా అయింది.  స్పీకర్‌ ఓంబిర్లా ఇరువర్గాల సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదు. దాంతో సభ ముందుగా మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ఆ తర్వాత కూడా సేమ్‌ సీన్‌ రిపీట్‌ కావడంతో సభాపతి సభను రేపటికి వాయిదా వేశారు.