కవితను విచారణకు పిలవడంతో మాట మార్చిన పిళ్ళై!

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక వ్యక్తిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైకి ఈడీ కస్టడీని న్యాయస్థానం మరో 3 రోజులు పొడిగించింది. అదే రోజున బిఆర్ఎస్ ఎమ్యెల్సీ కవిత కూడా విచారణకు హాజరుకావాల్సి ఉండడంతో ఆమెతో కలిపి విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.
 
కాగా, ఈ కేసుకు సంబంధించి గతంలో ఇచ్చిన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొంటూ కవితను విచారణకు పిలవడంతో అరుణ్ పిళ్లై కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు సిబిఐ ఆరోపించింది. పిటిషన్ పై  సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఈడీకి నోటీసులు జారీ చేసిన అనంతరం జరిగిన విచారణ సందర్భంగా వాదనలు వినిపించిన ఈడీ తరపు న్యాయవాదులు ఈ విషయమై కీలక వ్యాఖ్యలు చేశారు.
 
మార్చి తర్వాతనే స్టేట్ మెంట్ మార్చుకున్నారని చెబుతూ ఎందుకు మార్చుకున్నారో తెలుసని ఈడీ కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. కీలక సమయంలో వాంగ్మూలం ఉపసంహరణకు పిళ్లై పిటిషన్‌ వేశారని పేర్కొంటూ బలమైన వ్యక్తిని విచారణకు పిలిచినప్పుడు పిళ్లై తన స్టేట్మెంట్ మార్చుకున్నారని పేర్కొంటూ పరోక్షంగా కవిత పేరును ప్రస్తావించారు.
 
మొదటి సారి గతేడాది సెప్టెంబర్ 18న పిళ్ళై స్టేట్ మెంట్ రికార్డు చేశామని, ముడుపుల వ్యవహారంలో పిళ్ళై కీలక పాత్ర పోషించారని, ముడుపుల్లో ప్రధాన పాత్రదారి పిళ్ళై అని ఈడీ న్యాయస్థానానికి స్పష్టం చేసింది. పిళ్ళై, బుచ్చిబాబు కలిసి లిక్కర్ పాలసీ రూపకల్పనలో భాగస్వాములుగా ఉన్నారని, బుచ్చిబాబు ఇచ్చిన సమాచారం ఆధారంగా పిళ్ళైని, బుచ్చిబాబును ప్రశ్నించాల్సి ఉందని ఈడీ తెలిపింది.
 
బలవంతం చేసి పిళ్లై వాంగ్మూలం రికార్డు చేయలేదని తెలిపింది. పిళ్లై విచారణకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఉందని చెబుతూ వాంగ్మూలం నమోదులో నిబంధనలు పాటించామని స్పష్టం చేసింది. ముడుపుల వ్యవహారంలో పిళ్లై కీలకపాత్ర పోషించారన్న ఈడీ డిల్లీ లిక్కర్‌ పాలసీ రూపకల్పనలో పిళ్లై, బుచ్చిబాబు భాగస్వాములని వివరించింది.
 
2022 సెప్టెంబర్ 18న పిళ్లై పూర్తి స్టేట్ మెంట్ ఇచ్చారని.. తదుపరి విచారణలోనూ ఇవే వివరాలను ధృవీకరించారని పేర్కొంది. పిళ్లైని చిత్రహింసలకు గురిచేస్తే మిగిలిన స్టేట్మెంట్‌లలో అవే విషయాలను ఎలా నిర్ధారణ చేస్తారని ఈడీ ప్రశ్నించింది.  మరోవైపు లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబుకి ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. మార్చి 15న విచారణకు రావాలని ఆదేశించింది. ఈ క్రమంలో అరుణ్ పిళ్లైతో కలిపి బుచ్చిబాబుని విచారించే అవకాశం ఉంది.