మోదీకి సమాధి కట్టాలని కాంగ్రెస్ కలలు.. నేనేమో పేదలకోసం

మోదీకి సమాధి కట్టాలని కాంగ్రెస్ కలలు కంటుంటే..బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించి ప్రజలకు సుఖవంతమైన జీవితం అందించడంలో మోదీ బీజిగా ఉన్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. మోదీకి సమాధి కట్టాలని వారనుకుంటున్నా, దేశంలోని తల్లులు, సోదరీమణులు, ప్రజలంతా తనకు రక్షణ కవచంలా ఉన్నారని భరోసా వ్యక్తం చేశారు.

కర్ణాటకలోని మాండ్య లో బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేను ప్రధాని ఆదివారం ప్రారంభిస్తూ కాంగ్రెస్ పార్టీ 2014కు ముందు పేద ప్రజల జీవితాన్ని పతనం అంచులకు చేర్చేందుకు అందుబాటులో ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోలేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హయాంలో పేద ప్రజలు ఎలాంటి ప్రయోజనం పొందాలంటే కాళ్లరిగేలా కింద నుంచి పైవరకూ తిరగాల్సి వచ్చేదని గుర్తు చేశారు.

కానీ, బీజేపీ హయాంలో నేరుగా ఇంటి వద్దకే పథకాల ప్రయోజనాలు అందుతున్నాయని మోదీ చెప్పారు. అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పన దేశవ్యాప్తంగా జరుగుతోందని పేర్కొంటూ కర్ణాటకతో పాటు దేశమంతటా అభివృద్ధిపరంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పన కేవలం సౌలభ్యం కోసమే కాదని, అందువల్ల ఉద్యోగాలు, పెట్టుబడులు వస్తాయని, ఆదాయ వనరులను తెస్తుందని చెప్పారు.

 ”2022లో ఇండియా రికార్డు స్థాయి పెట్టుబడులు సాధించింది. కర్ణాటకకు ఎక్కువగా ప్రయోజనం చేకూరింది. కరోనా మహమ్మారి ఎదురైనా కర్ణాటకలో రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాం. గత తొమ్మిదేళ్లలో 2 కోట్లకు పైగా పేద ప్రజలకు ఇళ్లు కట్టించాం. ఒక్క కర్ణాటకలో లక్షలాది ఇళ్ల నిర్మాణం జరిగింది. జల్ జీవన్ మిషన్ కింద 40 లక్షల కుటుంబాలకు ట్యాప్ వాటర్ అందించాం” అని ప్రధాని వివరించారు.

దేశంలో దశాబ్దాలుగా నీటిపారుదల ప్రాజెక్టులను పెండింగ్‌లో ఉంచారని పేర్కొంటూ అప్పర్ భద్ర ప్రాజెక్టు ద్వారా వాటిని వేగవంతం చేశామని ప్రధాని చేశారు. చెరకు రైతులకు బడ్జెట్‌లో అనేక వెసులుబాట్లు కల్పించామని చెప్పారు. 2013-14 నుంచి రూ.17,000 కోట్ల ఇథనాల్‌ను చక్కెర కర్మాగాల నుంచి కొనుగోలు చేస్తామని, ఈ సొమ్ము చెరకు పండించే రైతులకు చేరుతుందని తెలిపారు.

బయోటెక్నాలజీ నుంచి రక్షణరంగ ఉత్పత్తుల తయారీ, ఏరోస్పేస్ నుంచి ఈవీ‌ల వరకూ కర్ణాటక ఈ కొత్త పరిశ్రమలకు ప్రధాన కేంద్రంగా ఉందని చెప్పారు. మాండ్యలోని చక్కెర రైతుల ఆదాయం పెరిగేందుకు ఇథనాల్ ఉత్పత్తిని పటిష్టం చేయనున్నామని తెలిపారు. కాగా, ఆరు లేన్ల బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేను ప్రధాని ఈ సందర్భంగా ప్రారంభించారు.

రూ.8,480 కోట్ల వ్యయంతో అభివృద్ధి పరచిన 118 కిలోమీటర్ల పొడవైన ఈ ఎక్స్‌ప్రెస్‌వేతో బెంగళూరు, మైసూరు మధ్య ప్రయాణ సమయం 3 గంటల నుంచి 75 నిమిషాలకు తగ్గుతుంది.  మాండ్య, హుబ్లి-ధార్వాడ్ జిల్లాలో రూ.16,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కూడా మోదీ ఆదివారంనాడు శంకుస్థాపన చేశారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటం, జేడీఎస్‌కు మాండ్య కంచుకోటగా ఉన్న నేపథ్యంలో ప్రధాని మాండ్య పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ కార్యక్రమంలో కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమై, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, రాజకీయవేత్తగా మారిన సినీ నటి, మాండ్య ఎంపీ సుమలత అంబరీశ్ కూడా పాల్గొన్నారు. సుమలత ఇటీవల బిజెపికి మద్దతునిస్తానని ప్రకటించారు. మార్గమధ్యంలో ప్రధాని మోదీ కారు దిగి జానపద కళాకారులను కలుసుకున్నారు. జనంతో మమైకమయ్యారు.

ఇలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి

లండన్ పర్యటనలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హుబ్లి పర్యటనలో స్పందిస్తూ భారతదేశ ప్రజాస్వామ్యంపై లండన్‌లో ప్రశ్నలు లేవనెత్తడం దురదృష్టకరమని చెప్పారు. కర్ణాటక ప్రజలు ఇలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలని సూచించారు.  భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్యమే కాకుండా, ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిదని తెలిపారు. అయితే కొందరు వ్యక్తులు దేశ ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు లేవనెత్తడం, దాడి చేయడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. భారతదేశ ప్రజాస్వామ్య విలువలకు హాని చేసే శక్తి ఎవరికీ లేదని ప్రధాని స్పష్టం చేశారు.