మోహన్ బాబుతో సోము వీర్రాజు భేటీ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కిరణ్ కుమార్ రెడ్డి ఆ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం జోరందుకున్న తరుణంలో మరొకొందరు ప్రముఖులను చేర్చుకునేందుకు బిజెపి నాయకులు ప్రయత్నాలను ముమ్మురం చేస్తున్నట్లు తెలుస్తున్నది. తాజాగా, మాజీ ఎంపీ ఎం మోహన్ బాబును బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కలిసి గంటసేపు ఏకాంత చర్చలు జరపడం ఆసక్తి కలిగిస్తోంది.
 
తిరుపతిలో మంచు మోహన్ బాబు ఇంటికి పార్టీ నేతలతో కలిసి సోము వీర్రాజు వెళ్లారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మద్దతు కోరేందుకు వెళ్లినట్లు చెబుతున్నారు. రాయలసీమ బీజేపీ అభ్యర్ధి సన్నారెడ్డి దయాకర్ రెడ్డికి మద్దతుగా సోము వీర్రాజు ప్రచారం చేస్తున్నారు. పార్టీ నేతలతో సమావేశం తరువాత మోహన్ బాబు, సోము వీర్రాజు మధ్య దాదాపు గంట సేపు ఏకాంత సమావేశం జరిగింది.
 
ఇందులో రాజకీయ అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ పట్ల ఆసక్తి ఉన్న వారి చేరికలను వేగవంతం చేయాలని పార్టీ నాయకత్వం రెండు రాష్ట్రాల నేతలకు స్పష్టం చేసింది. ఏపీలో త్వరలో బీజేపీలో కీలక చేరికలు ఉంటాయని కొద్ది రోజుల క్రితమే పార్టీ ముఖ్య నేతలు వెల్లడించారు. అందులో భాగంగానే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో పాటు మరో ఇద్దరు ముఖ్య నేతల పేర్లు ప్రచారంలో ఉన్నాయి.
 
టీడీపీలో ఎన్టీఆర్ హయాంలో పనిచేసిన మోహన్ బాబు రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీకి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు. జగన్ సీఎం కావాలని కోరుకున్నారు. కానీ, జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఇప్పటి వరకు కలవలేదు. మంచు విష్ణు మాత్రం సీఎం జగన్ ఇంటికి వెళ్లి కలిసారు.
 
మోహన్ బాబుకు టీటీడీ ఛైర్మన్ నామినేటెడ్ పోస్టు ఇస్తారని ప్రచారం సాగింది. మోహన్ బాబు మాత్రం తాను జగన్ సీఎం కావాలని కోరుకున్నానని, ఎటువంటి పదవి ఆశించలేదని స్పష్టం చేశారు. కొద్ది నెలల క్రితం అనూహ్యంగా మోహన్ బాబు హైదరాబాద్ లో టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు.
 
దీని పైన మోహన్ బాబు స్పష్టత ఇస్తూ సాయిబాబా ఆలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించేందుకు కలిసినట్లుగా చెప్పుకొచ్చారు. కానీ, రాజకీయంగా మోహన్ బాబు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. తన విద్యాసంస్థల పైనే ఎక్కువగా సమయం కేటాయిస్తున్నారు. మోహన్ బాబు పలు సందర్భాల్లో ప్రధాని మోదీ పైన అభిమానం చాటుకున్నారు. కుటుంబ సభ్యులతో పాటుగా ప్రధానితో సమావేశమయ్యారు. ఆ సమయంలోనే మోహన్ బాబు బీజేపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని ప్రచారం సాగింది. కానీ, ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
 
అయితే,  బీజేపీలో చేరనని కూడా ఎక్కడా చెప్పలేదు. ఆ తర్వాత ఆయన మౌనంగానే ఉన్నారు. ఇప్పుడు ఏపీలో ఎన్నికల వాతావరణం క్రమేణా వేడెక్కుతోంది. పొత్తుల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. ఈ సమయంలో ప్రముఖలను పార్టీలో ఆహ్వానించే ప్రక్రియను బీజేపీ వేగవంతం చేసింది.
మోహన్ బాబును బీజేపీలోకి రావాల్సిందిగా సోము వీర్రాజు ఆహ్వానించినట్లు తెలుస్తున్నది. మోహన్ బాబు ఈ విషయమై ఒక  నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.