ఏపీకి కేంద్రం నుండి రూ. 5,474 కోట్ల నిధుల విడుదల

ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్ర ప్రదేశ్ కు  కేంద్రం నుండి పన్నుల వాటాగా రావాల్సిన రూ. 5,474 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసింది. దీంతో ఈ ఆర్దిక సంవత్సరం చివరి నెలలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్దికంగా పెద్ద ఉపశమనం కలిగినట్లయింది.  ఈనెలలో ఆర్దికంగా ప్రభుత్వంపైచెల్లింపుల భారం ఉంది. అదే సమయంలో ఉద్యోగులకు బకాయిల చెల్లింపుపై కూడా ప్రభుత్వం హామీ ఇచ్చింది.

రూ 3వేల కోట్ల మేర ఉద్యోగులకు ఈ నెలాఖరులోగా చెల్లించాల్సి ఉంది. ఈ నెలలోనే 2023-24 ఎన్నికల బడ్జెట్‌ను ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.  ఇదే సమయంలో రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటా రెండు వాయిదాలను కేంద్రం విడుదల చేసింది. నీతి అయోగ్‌ సిఫార్సుల మేరకు రాష్ట్రాలకు కేంద్ర పన్నుల వాటాలో 41 శాతం చెల్లించాల్సి ఉంది. అందులో భాగంగా కేంద్రం తాజాగా రాష్ట్రాలకు రావాల్సిన వాటాను విడుదల చేసింది.

కేంద్రం రాష్ట్రాల పన్నుల వాటా కింద రూ 1,40,318 కోట్లు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు రూ 5,474 కోట్లు విడుదలయ్యాయి. తెలంగాణ రాష్ట్రానికి రూ.2,682 కోట్లు వాటాగా విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.

అన్ని రాష్ట్రాల కంటే ఉత్తరప్రదేశ్‌కు పన్నుల వాటాగా రూ.24,783 కోట్లు విడుదల చేశారు. మధ్యప్రదేశ్‌కు రూ.11,108 కోట్లు మంజూరు చేశారు. బీహార్‌కు రూ.14,232 కోట్లు వాటాగా వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. దీని ద్వారా రాష్ట్రాలకు గతంలో వచ్చిన పన్నుల వాటా కంటే మెరుగ్గా ఆదాయం సమకూరుతోందని కేంద్ర ఆర్థిక శాఖ చెబుతోంది.

కేంద్రం పన్నుల వాటాను ప్రతీ బడ్జెట్‌లోనే ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈసారి బడ్జెట్‌కు సంబంధించి ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది. 14వ తేదీ నుంచి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 17న బడ్జెట్‌ ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల ఏడాది కావటంతో ఈసారి బడ్జెట్‌లో సంక్షేమంతో పాటు ప్రాధాన్యతారంగాలకు కేటాయింపులు పెరిగే అవకాశం కనిపిస్తోంది.