
‘పుల్వామా’ దాడిలో (2019 ) మరణించిన జవాన్ల భార్యలు చేపట్టిన నిరసన రాజస్తాన్ లో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పుల్వామా దాడిలో అమరులైన జవాన్ల కుటుంబ సభ్యులు, బంధువులు, బీజేపీ కార్యకర్తలు వేలాదిగా జైపూర్ ను ముట్టడించారు.
పుల్వామా దాడిలో అమరులైన జవాన్ల కుటుంబంలోని ఒక వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని రాజస్తాన్ ప్రభుత్వం నాడు హామీ ఇచ్చింది. అయితే, కుటుంబ సభ్యులు అందుబాటులో లేకపోతే, దగ్గరి బంధువుల్లో ఒకరికి ఆ అవకాశం కల్పించాలని కోరుతూ ముగ్గురు అమర జవాన్ల భార్యలు జైపూర్ లో వారం క్రితం నిరసన ప్రారంభించారు.
వారిని శుక్రవారం పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బీజేపీ నిరసన ప్రారంభించింది. పేద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు జైపూర్ తరలివచ్చాయి. అలాగే, అమర జవాన్ల కుటుంబ సభ్యులు కూడా భారీగా వచ్చారు. నిరసన కేంద్రం వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసేశారు. పోలీసులతో బాహాబాహీకి దిగారు.
దాంతో పోలీసులు లాఠీ చార్జి చేసి నిరసనకారులను చెదరగొట్టారు. బీజేపీ నాయకులను, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. పుల్వామా బాధితులకు మద్దతుగా నిలిచిన బీజేపీ నేత కిరోరి లాల్ మీనా పోలీసులతో జరిగిన ఘర్షణలో గాయపడటంతో ఆయనను జైపూర్లోని సవాయ్ మాన్ సింగ్ ఆసుపత్రిలో చేర్చారు.
జైపూర్ నగర వ్యాప్తంగా పోలీసులను మోహరించారు. నిరసనలకు నాయకత్వం వహించిన బీజేపీ నాయకుడు, అసెంబ్లీలో ఉప విపక్ష నేత రాజేంద్ర రాథోడ్ తో పాటు పలువురు బిజెపి నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా రాజేంద్ర రాథోడ్ మాట్లాడుతూ రాజస్థాన్ ప్రభుత్వం పుల్వామా అమరుల భార్యలను అవమానిస్తోందని మండిపడ్డారు. పుల్వామా ఘటన జరిగి నాలుగేళ్లవుతున్నా ఇప్పటికీ నాటి హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు.
అయితే, పుల్వామా అమరుల రక్త సంబంధీకులకు మాత్రమే ఉద్యోగం కల్పించడం సాధ్యమవుతుందని, ఇతర దగ్గరి బంధువులకు ఉద్యోగం ఇవ్వలేమని రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఇప్పటికే స్పష్టం చేశారు.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు