7 రోజుల ఈడి రిమాండ్‌కు మనీశ్ సిసోడియా!

ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను ఢిల్లీ కోర్టు ఏడు రోజుల పాటు ఈడి కస్టడీకి అప్పగించింది. తీహార్ జైలులో గురువారం అతడిని అరెస్టు చేసిన ఈడి 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరింది. కాగా సిబిఐ కేసులో సిసోడియా బెయిల్ వినతిని మార్చి 21న విచారించనున్నట్లు కోర్టు తెలిపింది.

ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ సిసోడియానే  ప్రధాన సూత్రధారినని ఈడీ కోర్టుకుతెలిపింది. ఈ కేసులో ఆయన్ను విచారించాల్సి ఉందని తెలిపింది. ఇందుకోసం 10 రోజులు కస్డడీకి ఇవ్వాలని కోరింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ ఫ్రేమింగ్‌లో కుట్ర జరిగినట్లు ఈడి ఆరోపించింది. కొందరికి అక్రమంగా ప్రయోజనం చేకూర్చారంది. మనీశ్ సిసోడియా, విజయ్ నాయర్, కె.కవిత సహా సౌత్ గ్రూప్‌తో కలిసి కుట్ర చేశారని ఈడి వాదించింది.

వారంతా కుమ్మకై కొత్త మద్యం విధానాన్ని రూపొందించారని,  తద్వారా వారు అసాధారణ లాభాన్ని పొందారని తెలిపింది. ‘కొంత మందికి అక్రమ ప్రయోజనాలను అందించడానికి కుట్రపన్నారు. కొత్త మద్యం పాలసీ కోసం సౌత్ గ్రూప్ కుట్రపన్నిందని, దీని ఫలితంగా హోల్‌సేల్ వ్యాపారులకు అసాధారణ లాభాలు వచ్చాయి’ అని ఈడి వాదించింది.

 కాగా సిసోడియా తరఫు న్యాయవాది ‘అరెస్టులు చేయడం ఏజెన్సీల హక్కుగా తీసుకోవడం ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది. ఇలాంటి అరెస్టులపై కోర్టులు తీవ్రంగా చర్య తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది’ అని పేర్కొన్నారు. సిసోడియాను ఈడి అరెస్టు చేసిన ఒక రోజు తర్వాత ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. సిసోడియాను తీహార్ జైలులో అరెస్టు చేయడానికి ముందు ఈడి అధికారులు ప్రశ్నించారు. సిబిఐ ఫిబ్రవరి 26న కూడా ఇదే పాలసీలో ఇదివరకు ఆయనను అరెస్టు చేసింది.