సెమీ కండక్టర్లపై భారత్‌ – అమెరికాల ఒప్పందం

సెమీ కండక్టర్లకు సంబంధించి భారత్‌ – అమెరికాలు ఓ అవగాహన ఒప్పందం (ఎంఒయు) కుదుర్చుకున్నాయి. ఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన వాణిజ్య సదస్సు -2023 కార్యక్రమంలో అమెరికా వాణిజ్య మంత్రి గినా రైమాండో, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌లు ఈ ఒప్పందంపై సంతకం చేశారు.
 
ఇరు దేశాల మధ్య సహకారానికి ఈ  ఒప్పందం తోడ్పడుతుందని వారు పేర్కొన్నారు.  ఇరు దేశాల మధ్య సెమీ కండక్టర్లు, వాటికి సంబంధించి వాణిజ్య అవకాశాలతో పాటు ఎకోసిస్టమ్‌లో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కావాల్సిన విధి విధానాలపై చర్చించామని తెలిపారు.
 
ఇరు దేశాల మధ్య కొత్త వాణిజ్యం మరియు పెట్టుబడి అవకాశాలపై పెంపొందించేందుకు కావాల్సిన సహకారంపై చర్చలను తిరిగి ప్రారంభించినట్లు తెలిపారు. ఎలక్ట్రానిక్స్‌, సెమీకండక్టర్లకు సంబంధించి అమెరికా  కంపెనీలు తమ సరఫరా వ్యవస్థను వివిధ దేశాల మధ్య విస్తరించుకోవాలనే బలమైన ఆకాంక్షతో ఉన్నట్టు రైమాండో తెలిపారు.
 
చివరిసారిగా 2017లో అమెరికా, భారత్ ల   మధ్య వాణిజ్య సదస్సు జరిగింది. కరోనా , అనంతర పరిస్థితుల కారణంగా   ఈ సదస్సు కొనసాగలేదు.   మూడేళ్ల అనంతరం  తిరిగి 2023లో ఈ  సదస్సును తిరిగి  ప్రారంభమైంది.