తెలంగాణలో మహిళా ప్రజాప్రతినిధులకే రక్షణ కరువు

 
తెలంగాణలో మహిళా ప్రజాప్రతినిధులకే రక్షణ కరువైందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి  డీకే అరుణ విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మహిళల గోస.. బీజేపీ భరోసా దీక్ష ముగింపు సందర్భంగా ఆమె మాట్లాడుతూ  స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై ధర్మాసాగర్ మండలం జానకీపురం సర్పంచ్  నవ్య చేసిన ఆరోపణలను ప్రస్తావించారు.
ఒక సర్పంచ్ కే రక్షణ కరువైందంటే రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళా ప్రజాప్రతినిధులకు గౌరవం దక్కడం లేదని విచారం వ్యక్తం చేశారు. అభివృద్ధికి నిధులు కావాలని అడిగితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు.

మొన్న జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ విషయంలో కూడా అక్కడి ఎమ్మెల్యే వేధింపులకు గురిచేసిన విషయాన్ని డీకే అరుణ ప్రస్తావించారు. మహిళ అంటే తన కూతురు మాత్రమే కాదని, ఈ రాష్ట్రంలో ఉన్న అందరూ అనే విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలని అరుణ చురకలు అంటించారు. విద్యార్థులు, మహిళలపై ఎలాంటి అఘాయిత్యాలు జరిగినా సీఎం కేసీఆర్ స్పందించడం లేదని ఆమె మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో ఎక్కడ దాడులు జరిగినా ఆ సంఘటన వెనుక బీఆర్ఎస్ నాయకులు లేదా వాళ్ల పిల్లలు ఉంటున్నారని అరుణ తీవ్రమైన ఆరోపణ చేశారు.

కాగా, ఈ దీక్ష చేపట్టిన రాష్ట్ర బిజెపిని, అరుణను బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా అభినందించారు. ఆయన ఫోన్ చేసి తెలంగాణాలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలతోపాటు వారిపై జరుగుతున్న అఘాత్యాలు, హత్యలను నిరసిస్తూ దీక్ష చేయడం అభినందనీయమని కొనియాడారు. మహిళా సమస్యలపై పోరాడుతున్న తీరు భేష్ అని ప్రశంసించారు.

తెలంగాణ మహిళలకు బిజెపి జాతీయ నాయకత్వం అండగా ఉంటుందనే భరోసా ఇవ్వాలని ఆయన సూచించారు. మహిళా సమస్యల పరిష్కారంకోసం మరింత ఉధృతంగా పోరాడాలని రాష్ట్ర బిజెపి నేతలకు ఆయన సూచించారు.

కాగా, లిక్కర్ కేసు నుండి తప్పించుకునేందుకే కవిత ఢిల్లీలో దీక్ష చేస్తోందని  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.  సీఎం కేసీఆర్ ఇంటి ముందు కవిత ధర్నా చేయాలని ఆయన హితవు చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే మహిళలను అవమానిస్తున్నారని విమర్శించారు. సీఎం తీరుతో నే రాష్ట్రంలో మహిళలై వరుస ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు.

రాష్ట్రంలో 33 శాతం మహిళ రిజర్వేషన్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కేబినెట్ మీటింగ్ లో మహళలపై ఎందుకు మాట్లాడలేదని  సంజయ్ ప్రశ్నించారు. మహిళా హక్కుల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదని ఆయన స్పష్టం చేశారు. మద్యం రేట్లు పెంచిందే కవిత కోసమని స్పష్టం చేశారు.

రూ. 40 వేల కోట్ల ఆదాయం లిక్కర్ ద్వారా రాష్ట్రనికి వస్తోందని చెప్పారు. మహిళల అక్రమ రవాణాలో తెలంగాణ నెంబర్ 2గా ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న మహిళల దాడులపై సర్కార్ పట్టించుకోలేదని మండిపడ్డారు. మోదీ సర్కార్ లో 8 మంది మహిళలు మంత్రులుగా ఉన్నారని గుర్తు చేశారు. కేసీఆర్ పిల్లలకు పురుగులన్నం పెడుతున్నారని ఆరోపించారు.